
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్ర యునివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్‌గా పీవీజీడీ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ రెడ్డి వీసీగా బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ భావించినట్లుగా.. ఏయూని దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. యూనివర్సిటీలో స్థానం సంపాదించిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
యూనివర్సిటీలోని విద్య భోదనను సులభతరం చేసేందుకు పాలన విధానాలలో మార్పులు తీసుకొచ్చి, ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అదనపు ఉద్యోగులను నిమమిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, లెక్చరర్లకు ఏ సమస్య ఎదురైనా 24 గంటల్లో పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీని నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం వీసీగా అవకాశం వచ్చి చేజారినందుకు బాధపడ్డానన్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా తనను పిలిచి ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు.