
సాక్షి, గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అడుగడుగునా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నా ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు లోకేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవేంద్రపాడు బ్రిడ్జి నుంచి గ్రామంలోకి వచ్చే రహదారిలో స్వాగత ద్వారం నుంచి బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున దారి పొడవునా బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. లోకేష్ ఆ గ్రామంలో పర్యటిస్తున్నంతసేపు ఆ ఫ్లెక్సీలను అలాగే ఉంచారు. ఆయన వాహనాలు బయలుదేరగానే స్వాగత ద్వారానికి కట్టిన ఫ్లెక్సీని చించి పారేశారు.
పత్తా లేని ఎన్నికల అధికారులు
ప్రతి రోజు నారా లోకేష్ కార్యక్రమం ఎక్కడ జరిగినా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లోకేష్ ఎన్నికల ప్రచారంలో జనాలు కనిపించకపోయినా బ్యానర్‌లు, కార్లు 40 నుంచి 50 వరకు ఉండటం విశేషం. రేవేంద్రపాడులో చర్చిలోకి వెళ్లిన నారా లోకేష్ పాస్టర్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం అక్కడ ఉన్న ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా వెనుక ఉన్న కార్యకర్తలు మాత్రం సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఇప్పటికైన అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం నియామవళిని తూచా తప్పకుండా పాటించాలని ప్రతిపక్షనేతలు కోరుతున్నారు.