ఏపీ.. 16లక్షల ఓట్లు గల్లంతు | YSRCP Leader Botsa Satyanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

Published Thu, Aug 2 2018 5:56 PM | Last Updated on Thu, Aug 2 2018 8:32 PM

YSRCP Leader Botsa Satyanarayana Comments On Chandrababu - Sakshi

వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్సా సత్యనారాయణ

కాపు రిజర్వేషన్లపై యూటర్న్‌ తీసుకున్నది, కాపు ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టింది చంద్రబాబు కాదా... 

సాక్షి, విశాఖపట్నం : కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాపు రిజర్వేషన్లపై యూటర్న్‌ తీసుకున్నది, కాపు ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మంజునాథ కమీషన్‌ రిపోర్ట్‌ లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేశారని అన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.

బీసీలకు నష్టం లేకండా కాపు రిజర్వేషన్లు ఇవ్వడానికి వైఎస్సార్‌ సీపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. రాజకీయ లబ్ధికోసం బాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఓట్లను గల్లంతు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 16లక్షల ఓట్లను తొలిగించారని అన్నారు. ఏపీలో రాజ్యాంగానికి విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని అన్నారు. ఆనాడు రూ.2వేలు ఇస్తానని చెప్పి.. ఈ రోజు వెయ్యి రూపాయలు అంటున్నారని చెప్పారు. నాలుగేళ్లు కలిపి నిరుద్యోగ భృతి ఇస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు. నిరుద్యోగులను మళ్లీ మోసం చేయొద్దన్నారు.

వైఎస్‌ హయాంలోనే ఇరిగేషన్‌ ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులు కూడా చేయలేని మీరు వైయస్‌ను విమర్శిస్తారా అని మండిపడ్డారు. గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేసింది ఎవరని ప్రశ్నించారు.  పట్టిసీమ, పురుసోత్తపట్నం పేరుతో భారీ అవినీతికి పాల్పడ్దారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి యనమల వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితమంతా యూటర్న్‌లేనని ఎద్దేవా చేశారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన తెలియజేయటానికి ఈ నెల 9న గుంటూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement