
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని టెలికాం ఆపరేటర్లకు షాకిచ్చేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తుది కసరత్తు పూర్తి చేసింది. కాల్‌డ్రాప నిబంధనలు ఉల్లఘించిన కంపెనీలకు భారీ జరిమానా విధించేలా చర్యలు తుది దశకు చేరాయి. తాజా కాల్‌డ్రాప్ నిబంధనల ప్రకారం మార్చి త్రైమాసికంలో ఆపరేటర్లపై జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. కొత్త నిబంధనల అమలులోకి వచ్చిన నాటినుంచి రెండు త్రైమాసిక అంచనాలు పూర్తయ్యాయని ట్రాయ్ వెల్లడించింది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పెనాల్టీ విధించే క్రమంలో చివరి దశలో ఉన్నామని ట్రాయ్ ఛైర‍్మన్ ఆర్‌ఎస్ శర్మ పిటిఐకి తెలిపారు. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. 21 రోజుల్లోగా ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఆపరేటర్ల పేర్లను వెల్లడి చేయాలని తాము భావించడం లేదన్నారు.
మరోవైపు ట్రాయ్ కొత్త నెట్వర్క్ క్వాలిస్ ఆఫ్ సర్వీస్ (QoS) నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైనవని, పరిశ్రమలో టెలికాం ఆపరేటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమల సంస్థ కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో, కొన్ని సర్కిళ్లలో అనేకమంది ఆపరేటర్లపై ఫిర్యాదులు స్వల్పంగా తగ్గాయన్నారు. ప్రధాన ఆపరేటర్లు కొత్త నిబంధనలకనుగుణంగా సేవలను అందిస్తున్నారని నమ్ముతున్నామని మాథ్యూస్ చెప్పారు.
కాగా కాల్ డ్రాప్స్ నివారణ కోసం టెలికాం నెట్‌వర్క్ సంస్థలకు మార్గదర్శకాలను ట్రాయ్ విడుదల చేసింది. 2017 అక్టోబర్ 1 నుంచి టెలికాం ఆపరేటర్ల సేవా నాణ్యతపై ట్రాయ్ నిబంధనలను కఠినతరం చేసింది. వరుసగా 9నెలల పాటు ట్రాయ్ నిర్దేశించిన ప్రమాణాలు అందుకోలేని ఆపరేటర్లకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఫైన్ విధిస్తారు. నెట్‌వర్క్ తీరుకు అనుగుణంగానే లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించనున్నామని ట్రాయ్ వెల్లడించింది. కాల్ కట్ అయినా, అది నమోదు కాకుండా చూసుకునేందుకు టెలికాం ఆపరేటర్లు వినియోగిస్తున్నారని ఆరోపణలున్న రేడియో లింక్‌అవుట్ టెక్నాలజీ (ఆర్‌ఎల్‌టీ)కి ప్రమాణాలు నిర్దేశించిన సంగతి తెలిసిందే.