
సాక్షి, గోరంట్ల(అనంతపురం): భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీఐ జయనాయక్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జక్కసముద్రం గ్రామానికి చెందిన ఎరికల సోమశేఖర్(27), వరలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన సోమశేఖర్ తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. విసుగు చెందిన భార్య కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. తర్వాత సోమశేఖర్ వెళ్లి కాపురానికి రావాలని బతిమాలినా ఆమె ససేమిరా అంది. దీంతో మనస్తాపం చెందిన సోమశేఖర్ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.