సోమశిల ఉత్తర కాలువను పూర్తిచేసి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
సాక్షి, నెల్లూరు : సోమశిల ఉత్తర కాలువను పూర్తిచేసి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆత్మకూరు సభలో జగన్ మాట్లాడారు.
మహానేత వైఎస్సార్ హయాంలో సోమశిల ఉత్తరకాలువ నిర్మాణానికి రూ.177 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారన్నారు. వైఎస్సార్ హయాంలో దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. తొలుత 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో పనులు జరిగాయన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర కాలువ పనులను పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ఉత్తర కాలువకు సంబంధించిన అన్ని అనుమతులు పొంది వెంటనే కాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్ట్ వరకు నీటిని నడిపి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి ఇబ్బందులు సైతం తీరుస్తామని జగన్ హామీ ఇచ్చారు.
మేకపాటికి కేంద్రమంత్రి వర్గంలో చోటు
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆత్మకూరు ప్రచారసభలో జగన్ ప్రసంగిస్తూ గతంలో లాగా మేకపాటికి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీని ఇవ్వాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకొని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
గౌతమ్‌రెడ్డిని ఆశీర్వదించండి
వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఆత్మకూరు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు.