
రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నతస్థాయిని కల్పించిన తర్వాత, గుజరాత్ ఎన్నికల ఫలితాలను ప్రకటిం చడానికి ముందుగా నేను ఉద్దేశపూర్వకంగా ఈ కథనం రాయాలని ఎంచుకున్నాను. మొదటి అంశం నా నిర్ణయానికి ప్రాసంగికతను సమకూర్చగా రెండోది దాన్ని అసంగతంగా మారుస్తుంది. కాబట్టి నా అభిప్రాయాన్ని పరిశీలించడానికి మీకు సంగ్రహమైన వివరణ అవసరం.
అయితే దీనికి మరొక షరతును చేర్చనివ్వండి. నేను మోదీని తిరస్కరించడం లేదా కాంగ్రెస్‌ని సమర్థించడం కాకుండా ఒక సైద్ధాంతిక ప్రశ్నను లేవనెత్తుతున్నాను. 2019 ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేయాల్సి ఉంటుందన్న అంశంపై కోట్లాదిమందిని ఆలోచింపచేయగల సమస్యను నేను ఇక్కడ లేవనెత్తుతున్నాను.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఆమోదించటం అంటే నరేంద్రమోదీకి ఓటు వేయనందుకు మనం చెల్లించాల్సిన మూల్యంగా భావించాల్సిందేనా? నేను సూచించదల్చుకున్న సందిగ్ధావస్థ గురించి నొక్కి చెప్పడానికి నేను మరీ నిర్మొహమాటాన్ని ప్రదర్శించాను. నరేంద్రమోదీ గద్దె దిగిపోవాలని చాలామంది భావిస్తున్నారు కానీ రాహుల్ గాంధీని ప్రభుత్వాధినేతగా చూడాలన్న ప్రతిపాదన పట్ల ఇబ్బంది పడుతున్నారు. ఒకరిపట్లనేమో జనం అయిష్టతను ప్రదర్శిస్తూ.. ప్రమాదకారిగా భావిస్తున్నారు. మరొకరిని పరిపక్వత లేదని భావిస్తూనే కోరుకోవలసినవారిగా జనం చూస్తున్నారు.
కాంగ్రెస్ వాదులు ఈ ప్రశ్నను ఇష్టపడరు. వారు దీన్ని దురభిప్రాయంగా చూస్తారు లేక కనీసం అనుచితమైనదిగా భావి స్తారు. అయితే రాహుల్‌ని జనం ఎలా చూస్తున్నారనే అంశంపై కాంగ్రెస్ వాదులు కళ్లు తెరిచి చూస్తే, వారు సైతం దీన్ని ఒక చిక్కు సమస్యగా గుర్తించడమే కాకుండా, 18 నెలల తర్వాత మనం ఓటు వేయడానికి ముందుగా దీనిని పరిష్కరించాల్సి ఉందని కూడా గ్రహిస్తారు. కాకపోతే, కాంగ్రెస్‌కు తాము ఓటు వేయలేనప్పటికీ ప్రభుత్వంలో మార్పును అనేకమంది కోరుకోవచ్చు.
ఇప్పుడు లభ్యమయ్యే సమాధానంపై కాస్త వెలుగును ప్రసరింపచేసే రెండో అంశంపై నన్ను చెప్పనివ్వండి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ హక్కును నేను ప్రశ్నించడం లేదు. అత్యున్నత పదవిని ఆయనకు కట్టబెట్టడం వల్ల కాంగ్రెస్ అవకాశాలు మెరుగుపడవచ్చు కూడా. కానీ, ప్రతి కాంగ్రెస్ అధ్యక్షుడూ వెనువెంటనే ప్రధాని అవుతారా? ఇందిరాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో అలా సంభవించలేదు. ఇటీవలి కాలంలో చూస్తే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు గానీ ప్రధాని పదవిని చేపట్టడానికి తిరస్కరించారు.
ఎన్నికలను ప్రకటించడానికి ఎంతో ముందుగా సోనియాగాంధీ–మన్మోహన్ సింగ్ వంటి ఏర్పాటును పునరావృతం చేస్తే, ప్రభుత్వంలో మార్పును కోరుకుంటున్నప్పటికీ కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటే భయపడుతున్న వారి మనస్సుల్లోని సందేహాలు తొలగిపోతాయా? మన్మోహన్‌సింగ్ తరహా పాత్రను పోషించే వ్యక్తి పేరును పేర్కొనడం కష్టసాధ్యమని నేను అంగీకరిస్తాను. పైగా ఈ దశలో అలా చేయవలసిన అవసరం లేదు కూడా. 2019లో కాంగ్రెస్ గెలుపు సాధించినట్లయితే, 2004–2014 కాలంలో అమలులో ఉన్న తరహా ద్వంద్వ ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందా అనే విషయంపై స్పష్టత మాత్రం అవసరం.
రాహుల్‌గాంధీకి ఇదేమంత సులువుగా తీసుకునే నిర్ణయం కాదనుకోండి. తాను ప్రధానమంత్రిని అవుతానని, తన కుటుం బంలో నాలుగో తరం ఆ పదవిని స్వీకరిస్తుందనే నమ్మకంతోనే ఆయన ఎదుగుతూ వచ్చారు. దీన్ని పరిత్యజించడం అంత సులువు కాదు. అలా చేస్తే మాత్రం అది ఔన్నత్యానికి సంకేతం అవుతుంది. దీనికోసం ఆయన తనకంటే పార్టీనీ, దేశాన్ని ముందు స్థానంలో నిలపాల్సి ఉంటుంది. ఇది 2004లో ఆయన తల్లి చేసిన దానికంటే అతి పెద్ద త్యాగం అవుతుంది. ఆమె ఇటాలియన్ మూలమే ఆమెను ప్రధాని పదవికి అనర్హురాలిని చేయడాన్ని అర్థం చేసుకోలేం కానీ అది అప్పుడు అవసరమై ఉండవచ్చు. మరోవైపున రాహుల్ గాంధీ మీలాగా, నాలాగా భారతీయుడు.
మరొక విషయం: తాను ప్రధానమంత్రిని కాను అని రాహుల్ ప్రకటన చేస్తే అది భావోద్వేగాన్ని ప్రేరేపిస్తుంది. పోరాడి గెలిచినప్పటికీ అత్యున్నత పదవిపై ఆకాంక్ష లేకపోవడం.. మన సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే వినమ్రతను సూచించవచ్చు. అప్పుడు మోదీని జనం చూస్తున్న తీరునే అది మార్చివేయవచ్చు. అధికారంపై మోదీ ఆకాంక్షను తీరని క్షుద్బాధగా జనం ఎంచవచ్చు.
నా అభిప్రాయం సరైనదే అయినట్లయితే, నేను లేవనెత్తిన ప్రశ్న, దానికి నేను సూచించిన సమాధానం నెలలు గడిచే కొద్దీ మరింత సంకటంగా మారతాయి. కానీ నా అభిప్రాయం తప్పు అయ్యే అవకాశం కూడా ఉంది. మన భయాందోళనలు 2019కి ముందే తొలగిపోయి, రాహుల్ గాంధీని మనం చూస్తున్న తీరు పూర్తిగా మారిపోవచ్చు కూడా. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
- కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net