
పాక్ ఆగడాలపై ట్రంప్ సర్కారు చర్యలు..
న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని పాకిస్తాన్‌పై అమెరికా మండిపడింది. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్ తీసుకుంటున్న చర్యలు సరిపోవని, చేయాల్సింది మరెంతో ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియా అన్నారు. ఫిబ్రవరిలో 14న భారత్‌లోని పుల్వామాలో జరిగిన ఘాతుకాన్ని అమెరికా చూసిందని, పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏ అమెరికా ప్రభుత్వం తీసుకోని విధంగా పాక్ ఆగడాలపై ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టిందని శుక్రవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల పీచమణిచేలా చర్యలు చేపట్టాలని భారత్, అమెరికా శుక్రవారం పాకిస్తాన్‌కు స్పష్టం చేశాయి. ఉగ్రవాద అంతానికి పోరాడుతున్న భారత్‌కు అమెరికా దన్నుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికా రక్షణశాఖ సలహాదారు జాన్ బోల్టన్, భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే మధ్య గురువారం భేటీ కూడా అయింది.
(మళ్లీ మోకాలడ్డిన చైనా)
కాగా, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ యూఎన్ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్‌కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయాంగ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది.
(బెడిసికొడుతున్న మన దౌత్యం)