
నిహారిక
డాడీ... పెదనాన్న చిరంజీవిని నిహారిక అలానే పిలుస్తారు. మెగా బ్రదర్ తనయ నిహారిక తన పెదనాన్నకు అంత క్లోజ్. చిన్నప్పటి నుంచి ఆయన నటన చూస్తూ పెరిగిన నిహారిక ఇప్పుడు ఏకంగా పెదనాన్న సినిమాలో నటించే అవకాశం కొట్టేశారని టాక్. ముందే వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ్ ’తో నటి అయ్యి, ‘ఒక మనసు’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు నిహారిక. ఆ సినిమాలో మంచి నటనతో అందరి మనసులు గెలుచుకున్నారు.
ఈ సినిమా రిలీజయ్యాక అటు కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ‘ఒరు నల్ల నాళ్ పార్తు సొల్రేన్’ అనే తమిళ సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ‘సైరా’కి సై అన్నారట. ఇందులో ఓ మంచి రోల్ కొట్టేశారని టాక్. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న సినిమా ‘సైరా’. ఇందులో నయనతార కథానాయిక. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌సేతుపతి నటిస్తున్న ఈ సినిమాలో నిహారిక నటిస్తే ఆమెకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం.