
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి హిట్ కాంబినేషనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ అ..ఆ.. సినిమా నుంచి సీన్ మారిపోయింది. ఈ సినిమా అనిరుద్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు త్రివిక్రమ్, తరువాత అనిరుద్ తప్పుకోవటంతో తిరిగి దేవీతోనే మ్యూజిక్ చేయిస్తారని భావించారు ఫ్యాన్స్. కానీ త్రివిక్రమ్ మాత్రం మిక్కీ జే మేయర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు.
తరువాత పవన్ కళ్యాణ్ సినిమాకు హిట్ కాంబినేషన్ కాబట్టి దేవీతోనే మ్యూజిక్ చేయిస్తారని ఫ్యాన్స్ ఆశించినా.. త్రివిక్రమ్ మాత్రం అనిరుద్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు. దీంతో త్రివిక్రమ్, దేవీ శ్రీ ప్రసాద్‌ల మధ్య దూరం పెరిగిందన్న టాక్ మొదలైంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు కూడా అనిరుద్‌తోనే మ్యూజిక్ చేయిస్తుండటంతో ఆ టాక్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాదు కమల్ హాసన్‌ల పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపిన దేవీ శ్రీ, అదే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రివిక్రమ్‌కు శుభాకాంక్షలు తెలుపలేదు. వరుసగా నాలుగు సినిమాలకు కలిసి పనిచేసిన దర్శకుడికి విషెస్ తెలపకపోవటంతో నిజంగానే దేవీ శ్రీ, త్రివిక్రమ్ ల మధ్య ఏదో నడుస్తుంది అన్న టాక్ బలంగా వినిపిస్తోంది.