
శ్రీనగర్ : జమ్మూ,కశ్మీర్‌లో భారత భద్రతా దళాలకు మరో భారీ విజయం లభించింది యురి సెక్టార్‌లో భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను... భద్రతా దళాలు మధ్యలోనే అడ్డుకుని మట్టుబెట్టాయి. జమ్మూ,కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, పారా మిలటరీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ముందుగా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. అనంతరం తనిఖీలు నిర్వహించగా మరో ఉగ్రవాది.. జవాన్లపై కాల్పులు జరపడంతో ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో మరో ఉగ్రవాది మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్...భద్రతా దళాలను అభినందించారు.