
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శస్త్రచికిత్స జరిగింది. భోపాల్‌లోని హమిదియా హాస్పటల్‌లో ఆయన వేలుకు (ట్రిగ్గర్ ఫింగర్) వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది,. కొన్ని గంటలపాటు ముఖ్యమంత్రిని అబ్జర్వేషన్‌లో ఉంచి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
‘కమల్ నాథ్ శనివారం ఉదయం 9 గంటలకు హమీదియా ఆసుపత్రిలో చేరారు. అతని కుడి చేతి ట్రిగ్గర్ వేలికి ఆస్పత్రి వైద్య బృందం శస్త్రచికిత్స చేసింది’ అని గాంధీ మెడికల్ కాలేజీ డీన్ అరుణ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సీఎంకు కొన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు శనివారం ఉదయం శస్త్రచికిత్స చేశారు. మరోవైపు హాస్పటల్‌లో ఇతర రోగులు, సిబ్బందికి అసౌకర్యం కలిగించవద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావద్దంటూ కమల్‌నాథ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్‌నాథ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు.