
సాక్షి, న్యూఢిల్లీ : పేదవారి ఏసీ ట్రైన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ చార్జీలూ భారం కానున్నాయి. పదేళ్ల కిందట రూ 25గా నిర్ణయించిన ధరను సవరించాలని రైల్వేలు నిర్ణయించాయి. గత కొన్నేళ్లుగా లినెన్ ధర పెరిగినప్పటికీ గరీబ్ రథ్ రైళ్లలో ప్రయాణీకులకు అందించే దుప్పట్ల ధరను టికెట్ రేటులో కలపలేదు. అయితే తాజాగా ఈ ధరల భారాన్ని గరీబ్ రథ్ చార్జీలను పెంచడం ద్వారా కొంతమేర భర్తీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
బెడ్‌రోల్ ధరలను రైలు చార్జీల్లో కలపాలని కాగ్ కోరిన మీదట ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. రానున్న కొద్ది నెలల్లో బెడ్‌రోల్ ధరలు టికెట్ ధరలో కలపడంతో చార్జీలు కొంతమేర పెరుగుతాయని వెల్లడించారు.
బెడ్‌రోల్ కిట్స్ ధరలను టికెట్‌తో పాటే ప్రస్తుతం ఆఫర్ చేస్తుండగా, ఇక వీటి ధరలనూ టికెట్‌లో కలుపుతామని అధికారులు సంకేతాలు పంపారు. కాగ్ సూచనలతో పేద, సాధారణ ప్రయాణీకులు ఎంచుకునే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల పైనా చార్జీల వడ్డన తప్పేలా లేదు.