
ఢిల్లీ : లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షా తేదీల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం పరీక్షా తేదీలను వెల్లడించారు. జులై 18-23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక జులై 26న నీట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న కారణంగా వివిధ పరీక్షా తేదీలు వాయిదాపడ్డాయి.
అయితే పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించగా, 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇదే అంశానికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని రమేష్ పోఖ్రియాల్ అన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు.