
పోలవరం బిల్లుకు లోక్ సభ ఆమోదం
నిరసనలు, నినాదాల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు శుక్రవారం లోక్ సభలో ఆమోదం పొందింది.
న్యూఢిల్లీ : నిరసనలు, నినాదాల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు శుక్రవారం లోక్ సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో పోలవరం బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీంతో పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధ్రప్రదేశ్‌లోకి కలుపుతూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుకు చట్టబద్ధత లభించింది. సభ్యుల నిరసనలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశాలను మధ్యాహ్నం రెండు గంటలవరకూ వాయిదా వేశారు.
కాగా అయిదో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగించింది. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఎంపీలు గళం కలపడంతో లోక్‌సభ ఆందోళనలతో దద్దరిల్లింది.