హస్తినలో రాజకీయం మరోసారి వేడెక్కింది. పోలవరంపై మూడు రాష్ట్రాల ఎంపీలు ఏకమైయ్యారు.
న్యూఢిల్లీ : హస్తినలో రాజకీయం మరోసారి వేడెక్కింది. పోలవరంపై మూడు రాష్ట్రాల ఎంపీలు ఏకమైయ్యారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2014ను అడ్డుకునేందుకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు సిద్దం అయ్యారు. బిల్లును సమన్వయంతో, సమష్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు.
మూడు రాష్ట్రాల ఎంపీలు నిన్న సమావేశమై ఈ మేరకు వ్యూహాన్ని రచించారు. పోలవరం ముంపు గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లో కలపకుండా, గిరిజన గ్రామాలను తరలించకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. కాగా పోలవరం ప్రాజెక్టు బిల్లుపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరగనుంది.
పోలవరం బిల్లును అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్ పొరుగు రాష్ట్రాలతో కలిసి వ్యూహాలు రూపొందిస్తుంటే.. ఏపి సర్కారు కేంద్రంపైనే భారం వేసింది.ఎలాగైనా బిల్లును అడ్డుకోవాలని అటు తెలంగాణ.. బిల్లును గట్టెక్కించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శత విధాల ప్రయత్నిస్తున్నాయి. ఈకీలక పరిణామాల నేపధ్యంలో పోలవరం బిల్లు ఇవాళ పార్లమెంటుకు రానుంది. ఇక బీజేపీ తన పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది.