
సాక్షి, బెంగళూరు : న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు నగరంలో పబ్బులు, రెస్టారెంట్లు, బార్ల క్లోజింగ్ టైమ్‌లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. బార్లు, పబ్బులును ఉదయం రెండు గంటలకు వరకూ తెరిచివుంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బార్లు, పబ్బుల్లో స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు, పిల్లలతో వచ్చే తల్లులకు రిజర్వ్‌డ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని బెంగళూరు పోలీసులు బార్లు, పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
న్యూ ఇయర్ వేడుకలను సామరస్యంగా, ఆహ్లాదపూరిత వాతావరణంలో నిర్వహించుకోవాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్ ప్రజలను కోరారు. మద్యం మత్తులో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించేవారిని అక్కడికక్కడే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్న వారికి బలంవంతంగా విషెస్ చెప్పడం, అల్లరి చేష్టలకు దిగినవారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు.
నగరంలోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గంటల పాటు సీసీటీవీలో మానిటరింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా అల్లర్లు జరగవచ్చన్న ఉద్దేశంతో ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా 15 వేల మంది పోలీసులు వినిమోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.