
పోలింగ్ వేళల్లో మార్పు : అలా కుదరదన్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : రంజాన్ సందర్భంగా పోలింగ్ వేళలను మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్దానం సోమవారం తోసిపుచ్చింది. మే 19న లోక్‌సభ ఎన్నికల తుదివిడత పోలింగ్ ప్రారంభ సమయాన్ని ఉదయం ఏడు గంటలకు బదులు 5.30 గంటలకు మార్చాలని ఈసీని ఆదేశించాల్సిందిగా కోరుతూ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.
ఓటింగ్ సమయాన్ని ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్ధారించారని, ఓటర్లు ఉదయాన్నే ఓటువేయవచ్చని పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నాలతో కూడిన వెకేషన్ బెంచ్ సూచించింది. ఎన్నికల వేళను ముందుకు జరిపితే ఈసీకి రవాణా (లాజిస్టిక్) సమస్యలు ఉత్పన్నమవుతాయని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై ఈసీ వివరణను న్యాయస్ధానం కోరగా పోలింగ్ సమయాన్ని ముందుకు జరపలేమని ఈసీ నిరాసక్తత వ్యక్తం చేసింది.