
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్ వి.సప్నారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన కల్పిస్తున్నారని వివరించారు. కొన్ని చోట్ల 100 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీలకే ఇస్తున్నారన్నారు. వీటన్నింటినీ కలిపితే రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయన్నారు.