
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఏటీఎమ్ లాంటిదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. పోలవరం డ్యామ్ పూర్తి కాకుండానే మే నెలలో నీళ్లు ఇస్తామని చెప్పడం అంటే ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. చంద్రబాబుకు పోలవరం ఒక కామధేనువు, క్యాపిటల్ సిటీ కల్పవృక్షం లాంటివని ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాన మీడియా సంస్థలన్నీ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇష్టానుసారంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులు ఒక సామాజిక వర్గానికి ఇవ్వడం.. నాలుగేళ్లు గడిచిన తరువాత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లు పనిచేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి 2019 ఎన్నికల్లో డబ్బులతో ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా అవినీతి పెంచారని మండిపడ్డారు.