అడ్డంగా దొరకడం మిద్దెలెక్కి అరవడం | KTR Slams Chandrababu And Lokesh Over It Grid Data Scam | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరకడం మిద్దెలెక్కి అరవడం

Published Tue, Mar 5 2019 2:47 AM | Last Updated on Tue, Mar 5 2019 7:37 AM

KTR Slams Chandrababu And Lokesh Over It Grid Data Scam - Sakshi

సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రరత్నం లోకేశ్‌కు ఒక అలవాటు ఉంది. తప్పులు చేయడం, అడ్డంగా దొరికిపోవడం, దొరికిన తర్వాత మిద్దెలు ఎక్కి అరవడం, బుకాయించడం. ఓటుకు కోట్లు కేసులోనూ బ్రీఫ్‌డ్‌ మి.. అని అడ్డంగా దొరికిపోయి, ఫోన్‌ ట్యాపింగ్‌ అని ఇదే విధంగా రంకెలు వేశాడు. ఈరోజు డేటా చోరీ కేసులోనూ ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు’అని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికార వ్యవస్థ ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థపై దాడి చేసిందని చంద్రబాబు సిల్లీగా మాట్లాడుతున్నారు.

అమెరికా టూరిస్టు అమరావతిలో పర్సు పోగొట్టుకుంటే అమరావతి పోలీసులు కేసు నమోదు చేసినట్లుగానే.. హైదరాబాద్‌లో నివసిస్తున్న లోకేశ్వర్‌రెడ్డి అనే ఏపీ పౌరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ ప్రభుత్వ సమాచారం చోరీకి సంబంధించి ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై విచారణ జరుపుతున్నాం’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌ డేటా సెంటర్‌లోని సమాచారాన్ని ఐటీ చట్టం లోని 66, 72 సెక్షన్లను ఉల్లంఘిస్తూ ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తస్కరించి తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుస్తోందనే ఫిర్యాదు తెలంగాణ పోలీసులకు అందిందన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే తెలంగాణ పోలీసులు.. లబ్ధి పొందాలని అనుకుంటున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని కేటీఆర్‌ వెల్లడించారు.

‘గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని దోపిడీ చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని టీడీపీకి, ఆ పార్టీకి చెందిన సంస్థలకు అప్పగించడంపై సిగ్గుపడాలి. చంద్రబాబుకు సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదు. బాధ్యత ఉంటే విచారణకు ముందుకు రావాలి. సమాచార తస్కరణపై విచారణ జరుపుతున్న తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం’అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి..
ప్రజల్లో పరపతి కోల్పోయిన చంద్రబాబు... తెలంగాణ ప్రభుత్వంపై బట్ట కాల్చి మీద వేసే చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ‘దొంగతనం చేయకపోతే, ఆంధ్రా ప్రజల సమాచారాన్ని మీ పార్టీ తొత్తులకు అప్పగించక పోతే మీకు భయం ఎందుకు? ఇప్పటికే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. డేటా తస్కరణ జరగకుంటే విచారణకు వచ్చి కడిగిన ముత్యంలా బయటకు రండి’అని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తమను బదనాం చేయించే క్యాంపెయిన్‌ నడుస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. సోషల్‌ మీడియా లేనప్పుడు టీడీపీ నాటకాలు నడిచాయని, కానీ ఇకపై సాగవని చంద్రబాబు, లోకేశ్‌ను హెచ్చరించారు.

మా నేతలను మీరెంతకు కొన్నారు?
తమ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావును టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సమక్షంలో యూపీ బీజేపీ ఎంపీ సావిత్రీబాయి ఫూలే చేరడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. ‘బీజేపీ ఎంపీని మీ అధ్యక్షుడు ఎంతకు కొన్నారో చెప్పాలి. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు పార్టీ మారాలని నిర్ణయించుకుంటే సంతలో పశువులు, అంగట్లో సరుకులు అంటూ మీరు సంస్కార హీనంగా వ్యాఖ్యలు చేశారు’అంటూ ఉత్తమ్‌ తీరును దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన తమ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవరెడ్డి, అంతకంటే ముందే పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎంతకు కొనుగోలు చేసిందో ఉత్తమ్‌ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

‘మా పార్టీ నాయకత్వంలో చేవ చచ్చింది. జోషే లేదు.. అంటూ మీ సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీ నాయకత్వంలో సమర్ధత, విశ్వాసం లేదని మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్న సందర్భంలో, గిరిజన శాసనసభ్యుల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉత్తమ్‌ వ్యాఖ్యలు ఉన్నాయి’అని కేటీఆర్‌ విమర్శించారు. ఆదివాసీలు, గిరిజనుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబద్ధత చూసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని కేటీఆర్‌ చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తామని వారు ప్రకటించాక కూడా ఉత్తమ్‌ దురహంకార వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘తెలంగాణలో మీ ఎన్నికల భాగస్వామి చంద్రబాబు ఏపీలో 26 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి కళంకం అని అనిపించలేదా?’అని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలంతా మొదటి నుంచీ అదే పార్టీలో ఉన్న వారేనా? అని నిలదీశారు.

ఇలాంటి ఆరోపణలతో రాజకీయ వ్యవస్థపై ప్రజలకు చులకన భావం ఏర్పడుతుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకు పోవడం సహజమన్నారు. కాగా, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవని, ఇప్పటివరకు పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేటీర్‌ వెల్లడించారు. శాసనసభ్యుల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో గెలుచుకునే వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు అజయ్, వివేకానంద, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు వ్యక్తులపై
ఐటీ దాడులు జరిగితే కేబినెట్‌లో చర్చిస్తారు. ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థపై తెలంగాణ పోలీసులు విచారణ జరిపి చర్య తీసుకుంటే ఏపీ ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది. తప్పు చేయకుంటే చంద్రబాబుకు భయం ఎందుకు? కంప్యూటర్‌ను కనిపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ప్రభుత్వ డేటాను అమ్ముకోవడం సిగ్గు చేటు’అని కేటీఆర్‌ విమర్శించారు. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని కొనసాగించడంపై ఏపీ ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ‘కంప్యూటర్‌ను కనిపెట్టాను అని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఈవీఎంలు అంటే భయపడుతున్నారు. ఐదేళ్లుగా గ్రాఫిక్స్‌తో సినిమాలు చూపించారు. ఇప్పుడు తెలంగాణను బూచిగా చూపించి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

చదవండి: ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement