
పనాజీ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ సయ్యద్‌లపై గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో (2018) ఒమర్, ముఫ్తీలు కశ్మీరీ ప్రజల నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. 2018లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పాకిస్తాన్ ఒత్తిడితో ఆ ఇద్దరు సీఎంలు ఎన్నికలను బాయ్‌కాట్ చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా పాక్ ప్రమేయంతో వారు కుట్రపన్నారని విమర్శించారు. అంతేకాకుండా కశ్మీరీ వ్యతిరేకులతో వారిద్దరూ చేతులు కలిపారని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాను ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని చెప్పుకొచ్చారు. తాను కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో స్థానిక ప్రజల అనేక సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు.