
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): టీడీపీ నేతలను ఓటమి భయం వెంటాడుతోంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రి అమరనాథ్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్, పలువురు కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. పోలింగ్ పూర్తయిన నెల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడం దారుణమని మండిపడ్డారు. రీపోలింగ్ రద్దు చేయాలంటూ సబ్ కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
టీడీపీ నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పార్టీ కండువాలు ధరించి, టీడీపీ జెండాలతో హంగామా చేశా రు. దీంతో అన్నమయ్య సర్కిల్ నుంచి ముత్యాలరెడ్డిపల్లికి రాకపోకలు స్తంభించాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ధర్నా చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు, నిరసనలకు అనుమతి లేకున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు.