మోదీకి సుష్మా ప్రత్యామ్నాయమా? | Sushma Swaraj Announcement Raised More Questions | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 24 2018 5:17 PM | Last Updated on Sat, Nov 24 2018 5:20 PM

Sushma Swaraj Announcement Raised More Questions - Sakshi

సుష్మా స్వరాజ్‌ ప్రకటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రకటించడం పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. యూరప్‌ లేదా అమెరికా పార్లమెంటేరియన్లు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే వారు రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నారని అర్థం. కానీ భారత్‌లో అలా కాదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే అందులో ఓ పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లు లెక్క. 2019లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పిన సుష్మా, తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. అంటే రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లో కొనసాగుతారని అర్థం. పార్టీ కోరితే మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. అంటే ఏమిటీ?

అలర్జీ కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదంటూ ఆమె చెప్పడం సహేతుకంగా కనిపించడం లేదు. 2016లో ఆమెకు జరిగిన కిడ్నీ మార్పిడి కారణంగా అలర్జీ వచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం ఉండదు. అలర్జీ కారణమే నిజమనుకుంటే ఆమె ఢిల్లీలోనే ప్రకటించి ఉండాల్సింది! మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి అక్కడ ప్రకటించడం ఏమిటీ? డిసెంబర్‌ 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి గనుక అప్పటి వరకు ఆగనూ వచ్చు, అలా ఎందుకు చేయలేదు? ఈ ప్రకటన వెనక కచ్చితమైన టైమింగ్‌ ఉందని ఆమె భర్త స్వరాజ్‌ కౌశల్‌ ట్వీట్‌ చేయడంలో అర్థం ఏమిటీ?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్రకటిత నియమం ప్రకారం 75 ఏళ్ల వరకు మంత్రి పదవిలో కొనసాగవచ్చు. ప్రస్తుతం సుష్మకు 66 సంవత్సరాలే. ఇంకా ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంది. ఆమె నరేంద్ర మోదీ కేబినెట్‌లో పేరుకే విదేశాంగ మంత్రన్న విషయం తెల్సిందే. ప్రతి విదేశీ పర్యటనకు మోదీనే వెళుతున్నారు. కనీసం ఆమె వెంట కూడా తీసుకుపోవడం లేదు. ఈ విషయంలో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి సురక్షితంగా రప్పించడం కోసం ఆమె కృషి చేయడం ద్వారా ఆమె వార్తల్లో ఉంటున్నారు తప్ప, విదేశాల్లో పర్యటించడమో, విదేశాంగ విధానాల గురించి మాట్లాడడం ద్వారా ఉండడం లేదన్నది సుస్పష్టమే.

మొదటి నుంచి ఆమెది బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ శిబిరమన్నది రాజకీయ వర్గాలకు తెల్సిందే. అందుకని మోదీ ఆమెను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారా? అదే నిజమనుకుంటే వచ్చే ఎన్నికల అనంతరం వేటు తప్పదని భావిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కారీల సరసన ఆమె కూడా చేరిపోతారు. అది ఊహించే ఆమె కొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో వ్యూహ, ప్రతివ్యూహాలు మారవచ్చని, అప్పుడు వాటికి అనుగుణంగా పావులు కదపచ్చనే ఉద్దేశంతో అనుమానం రాకుండా ఎన్నికల ఫలితాలను ముందుగానే ఈ ప్రకటన చేశారా? 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభావం తగ్గి ఎన్డీయే పక్షాల బలం పెరిగినట్లయితే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకురాలిగా ముందుకు రావాలన్నది ఆమె వ్యూహమా?

మోదీ ఏకఛత్రాధిపత్యం పట్ల పార్టీ నాయకుల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. అలాంటి పరిస్థితుల్లో తెరమాటుకు వెళ్లిపోయిన అద్వానీ మళ్లీ తెర ముందుకు వస్తే.....? ప్రస్తుతానికి సమాధానాలకన్నా ప్రశ్నలపరంపరే ఎక్కువ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement