
సాక్షి, శ్రీకాకుళం: ఏపీ శాసనసభలో అధికార పార్టీ అప్రజాస్వామిక తీరుకు నిరసనగా ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టారని ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య చైతన్యం కోసం చేపట్టిన పాదయాత్రపై టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయినప్పటికీ ప్రజలే రక్షణ కవచంలా ఉండి ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ లక్ష్యం మంచిది గనుకనే పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఓ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు.. పార్టీ మారాలి అనుకుంటే రాజ్యాంగ బద్దంగా వ్యహహరించాలన్నారు. ఎమ్మెల్యేల అక్రమ ఫిరాయింపలకు స్పీకర్, గవర్నర్ మద్దతు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీని ఎల్లో వైరస్ తినేస్తోందని విమర్శించారు. తిత్లీ తుఫాన్ బాధితుల పరిహారాన్ని టీడీపీ ఫలహారం చేస్తోందని దుయ్యబట్టారు.