
భువనగిరి అర్బన్: హైదరాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం బ్రాందీ నగరంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో బీజేపీ జిల్లా కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంకారెడ్డి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, మరోవైపు బార్లను తెచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్‌రెడ్డి, పోతంశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.