సాధారణంగా అక్టోబర్ నెలాఖరు వరకు పెసర సాగు చేస్తారు.
బాల్కొండ : సాధారణంగా అక్టోబర్ నెలాఖరు వరకు పెసర సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్‌లోనూ కొందరు రైతులు పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ పంట సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమని, సుమారు రెండు నెలల్లో చేతికి వచ్చే పెసరను రబీలో ఈనెల మూడో వారం వరకు సాగు చేయవచ్చని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు. మాగాణుల్లో అయితే వచ్చేనెల 15వ తేదీ వరకు పంటను సాగు చేయవచ్చని పేర్కొన్నారు.
విత్తన శుద్ధి
పంట తొలి దశలో రసం పీల్చు పురుగులు, ఇతర తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. విత్తనశుద్ధితో వీటిని నివారించవచ్చు. కిలో విత్తనాలకు 40 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 5 గ్రాముల ఇడిడాక్లోప్రిడ్ లేదా 5 మి.లీ. మోనోక్రొటోఫాస్, 3 గ్రాముల కాప్టాన్ లేదా మాంకోజెబ్‌లతో విత్తన శుద్ధి చేయాలి.
మొదటిసారి పెసర పంట సాగు చేసే భూముల్లో అయి తే.. 200 గ్రాముల రైజోబియం, పీఎస్‌బీ 200 గ్రాముల కల్చర్ ను కలిపి విత్తనం శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల నత్రజని, భాస్వరం అవసరం 50 శాతం తగ్గుతుంది.
విత్తనం
ఎకరానికి పది కిలోల వరకు విత్తనం అవస రం. అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై అందిస్తోంది.
నేల తయారీ, విత్తేవిధానం
ఒకసారి నాగలితో దున్నాలి. రెండు సార్లు గొర్రు కొట్టాలి. తర్వాత గుంటుకతోలి నేల ను తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య పది సెం టీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి.