రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కుటుంబ సమగ్ర సర్వే’ నియోజకవర్గంలోని వలస జీవులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కుల్కచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కుటుంబ సమగ్ర సర్వే’ నియోజకవర్గంలోని వలస జీవులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఎక్కడున్నా సరే ఈ నెల 19న జరిగే సర్వేకు హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. వీటి ఆధారంగానే రేషన్‌కార్డులు, ఇళ్లు, పింఛన్ తదితర సంక్షేమ పథకాలు వర్తిస్తాయని అధికారులు ప్రచారం చేస్తున్నారు.
అయితే స్థానికంగా ఉపాధి లేక పనుల కోసం ముంబయి, పూణే ,షోలాపూర్, హైదరాబాద్ తదితర నగరాలకు , దుబాయి,ఉగాండా దేశాలకు ఎంతోమంది వలసలు పోయారు. వీరందరూ తిరిగి రావాలంటే ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల,గండేడ్,దోమ,పూడూరు,పరిగి మండలాల నుంచి 40 శాతం ప్రజలు వలసలోనే ఉన్నారు. కుటుంబంలో ఒక్కరైతే రావచ్చుగాని కుటుంబమంతా అంటే చాల కష్టమని వారు వాపోతున్నారు.
ఒక్క రోజు మాత్రమే సెలవు
కుటుంబ సమగ్ర సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం 19న ఒక్క రోజును మాత్రమే సెలవుదినంగా ప్రకటించిం ది. అయితే పట్టణాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు 18న విధులు నిర్వహించుకొని అదే రోజు గ్రామాలకు రావాలంటే చాలా ఇబ్బంది. 19న రావాలంటే ఆ రోజు రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వమే వాడుకుంటుంది. ప్రైవేటు వాహనాలను కూడా ప్రభుత్వం వాడుకుంటుంది. దీంతో సర్వేకు రావాలనుకునేవారికి రవాణా కూడా సమస్యగానే మారనుంది.