మా సొమ్ములివ్వండి మహాప్రభో..! | Paid money was not returned | Sakshi

మా సొమ్ములివ్వండి మహాప్రభో..!

Published Sun, May 5 2019 2:43 AM | Last Updated on Sun, May 5 2019 10:22 AM

Paid money was not returned - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దరఖాస్తులు తిరస్కరించి నాలుగేళ్లయినా.. చెల్లించిన సొమ్ము మాత్రం తిరిగి రాలేదు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీకరణకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జీఓ 58,59ను జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు జీఓ 58 కింద ఉచితంగా స్థలాలను క్రమబద్ధీకరించిన సర్కారు..జీఓ 59 కింద (చెల్లింపు కేటగిరీ)మాత్రం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించిన వారికి స్థల యాజమాన్య హక్కులు కల్పించింది. అయితే, జీఓ 59 కింద అనర్హమైన దరఖాస్తుదారుల డబ్బులను రిఫండ్‌ చేయకుండా మొండికేసింది.

తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు డబ్బును వాపసు చేయమని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అర్జీలు స్వీకరించిన సమయంలో డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో దరఖాస్తుదారులు నిర్దేశిత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. ఈ నిధులను కొన్నాళ్లు తమ ఖాతాల్లోనే ఉంచుకున్న తహసీల్దార్లు.. ఏ పద్దు కింద వీటిని డిపాజిట్‌ చేయాలో తెలియక స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు అట్టిపెట్టుకోవడం సరికాదని భావించిన ప్రభుత్వం.. ఆ నిధులను ట్రెజరీల్లో జమ చేయాలని ఆదేశించింది. 

మూలుగుతున్న రూ.48.56 కోట్లు 
చెల్లింపు కేటగిరీ కింద స్థలాల క్రమబద్ధీకరణ చేసుకున్న అర్జీలలో 2,761 దరఖాస్తులను ప్రభుత్వం తోసిపుచ్చింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేనివాటిని, రైల్వే, కాందిశీకులు, తదితర కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భూములు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెలిసిన కట్టడాల రెగ్యులరైజ్‌కు చేసుకున్నవాటిని అనర్హమైనవి తేల్చింది. ఈ మేరకు తిరస్కరణ గురైన దరఖాస్తుదారులకు చెల్లించిన మొత్తాన్ని వాపస్‌ చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, మెదక్, జోగులాంబ–గద్వాల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.48.56 కోట్లు ఇవ్వాల్సివుంటుందని లెక్క గట్టింది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడంతో నిరాశకు గురైన అర్జీదారులు కనీసం చెల్లించిన మొత్తమైనా వస్తుందని భావించి తహసీళ్ల చుట్టూ చక్కర్లు కొట్టారు. దరఖాస్తుదారులు కట్టిన మొత్తాన్ని ట్రెజరీల్లో జమ చేసినందున.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే తప్పా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

దరఖాస్తుదారుల ఆవేదనను ఆర్థం చేసుకున్న కలెక్టర్లు రిఫండ్‌ విషయాన్ని తేల్చాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. డబ్బును వాపస్‌ చేయమంటూ ఉత్తర్వులు జారీ చేసినా.. ఏ పద్దు కింద ట్రెజరీ నుంచి తిరిగి తీసుకోవాలనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆఖరికి ఈ వ్యవహారంపై స్పష్టతనిస్తూ గతేడాది మే 18న జీఓ 206 జారీ చేసినా.. కలెక్టర్లు  ఇప్పటివరకు దరఖాస్తుదారులకు నయాపైసా వెనక్కి ఇవ్వలేదు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు చక్కర్లు కొడుతున్నా.. రెవెన్యూ గణం మాత్రం కనికరించడంలేదు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లుగా ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. కలెక్టర్లు మాత్రం స్పందించకోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement