
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో బుధవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. (రెండ్రోజుల్లో ‘నైరుతి’!)
రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, గండిపేట, మణికొండ, పాతబస్తీ లాలదర్వాజ, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడా, ఛత్రినాక, అలియబాద్, ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్, నారాయణగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, ట్యాంక్ బండ్ గోషామహల్, ఖైతరాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌లో వర్షం పడింది. కాగా రానున్న 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈదురుగాలులతో వర్షాలు పడ్డాయి.