విద్యుత్‌శాఖ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని సీఎం కె.చంద్రశేఖరరావు ఆదేశించారు.
అధికారులకు సీఎం ఆదేశం సీఎం రిలీఫ్ ఫండ్‌కు హౌసింగ్ ఉద్యోగుల విరాళం
హైదరాబాద్: విద్యుత్‌శాఖ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని సీఎం కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం నేతలు ఎన్.సుధాకర్ రావు, ఎన్.శివాజి గురువారం సచివాలయంలో సీఎంను కలసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న అన్నిస్థాయిల ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని విద్యుత్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషిని సీఎం ఆదేశించారు. ఇదిలా ఉండగా,ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.8.85 లక్షలను విరాళంగా ఇచ్చారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకునేందుకు సగంరోజు వేతనం రూ.4,44,058లను అందజేశారు. టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, కార్యదర్శి నరేందర్ రావు నేతృత్వంలో హౌసింగ్ ఉద్యోగుల సంఘం నేతలు సీఎంను కలసి చెక్కులను అందజేశారు.
పదోన్నతులపై నిషేధం తొలగింపు
జిల్లాస్థాయి ప్రమోషన్లు, కారుణ్యనియామకాలపై గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సీఎం. కె.చంద్రశేఖరరావు ఆదేశాలు జారీచేశారు. తాము చేసిన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించడంతో పదోన్నతులురాక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయని టీఎన్జీవోనేత జి. దేవీప్రసాద్ తెలిపారు. గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో దేవీప్రసాద్, కె. రవీందర్‌రెడ్డి కలసి తమ సమస్యలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దసరాలోగా పదో పీఆర్‌సీ, ఆరోగ్యకార్డులు, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరగా అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని దేవీప్రసాద్ చెప్పారు. పెన్షనర్లకు కూడా ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలని కోరగా సీఎం ఆ అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.