Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Condoles Pope Francis death1
పోప్‌ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి

తాడేపల్లి : క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్(88) కన్నుమూయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా సంతాపం తెలిపారు వైఎస్‌ జగన్‌. ‘పోప్ మృతి చాలా బాధాకరం. కాథలిక్ చర్చి సమాజానికి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం ప్రపంచ వ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది. పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. Saddened by the passing of Pope Francis. A transformative and influential head of the Catholic Church — the first Pope from the Latin Americas. A true humanitarian and global voice for peace and compassion. His humility and humanity touched the world.May his soul rest in eternal…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2025 కాగా క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.ఈస్టర్‌ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్‌ బెనెడిక్ట్‌-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్‌ కేథలిక్‌ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది.

Supreme Court Reacts On BJP leaders Criticism2
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్‌ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్‌ గవాయ్‌ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్‌ రిట్‌ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్‌ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్‌ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్‌ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్‌, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్‌ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్‌ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్‌ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్‌ గవాయ్‌(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్‌ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్‌, సూటి, ధులియాన్‌, జంగిపూర్‌ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.

Virender Sehwag Roasts 2 Misfiring Overseas IPL Stars3
'వారిద్ద‌రూ ఎంజాయ్ చేయ‌డానికి వ‌చ్చారు'.. స్టార్ క్రికెట‌ర్ల‌పై సెహ్వాగ్ ఫైర్‌

ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆల్‌రౌండ‌ర్లు గ్లెన్ మాక్స్‌వెల్‌, లియామ్ లివింగ్‌స్టోన్ దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ఏ మ్యాచ్‌లోనూ ఈ స్టార్ క్రికెట‌ర్లు త‌మ మార్క్‌ను చూపించ‌లేక‌పోయారు.దీంతో వారిద్ద‌రిపై ఇరు జ‌ట్ల మెన్‌జెమెంట్‌లు వేటు వేశాయి. ఇప్ప‌టికే మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ గ‌త రెండు మ్యాచ్‌ల‌కు దూరం పెట్ట‌గా.. ఆర్సీబీ కూడా లివింగ్ స్టోన్‌ను త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో బెంచ్‌కే ప‌రిమితం చేసింది. ఆదివారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో లివింగ్ స్టోన్‌కు ఆర్సీబీ తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. అత‌డి స్దానంలో క‌రేబియ‌న్ ఆల్‌రౌండ‌ర్ రొమారియో షెపర్డ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో మాక్స్‌వెల్‌, లివింగ్ స్టోన్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు. వారి ఆట తీరును చూస్తుంటే ఏదో హాలిడేకి వ‌చ్చిన‌ట్లు ఉంద‌ని సెహ్వాగ్ మండిప‌డ్డాడు."మాక్స్‌వెల్‌, లివింగ్ స్టోన్‌లో తమ జట్ల కోసం పోరాడాలనే క‌సి క‌నిపించ‌డం లేదు. వారు ఏదో హాలిడే కోసం భార‌త్‌కు వ‌చ్చిన‌ట్లు అన్పిస్తోంది. ఇక్క‌డ‌కు వ‌చ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్లిపోవ‌డ‌మే వాళ్లు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అంతే తాము ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జ‌ట్టు కోసం ఏదైనా చేయాల‌నే త‌ప‌న వారిలో లేదు. గ‌తంలో చాలా మంది విదేశీ క్రికెట‌ర్ల‌తో క‌లిసి ఆడాను. వారిలో ఒక‌రిద్ద‌రూ మాత్ర‌మే జట్టు కోసం ఏదైనా చేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు అప్పటిలో నాకు అన్పించింద‌ని" క్రిక్‌బ‌జ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా మాక్స్‌వెల్ ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 41 ప‌రుగుల‌తో పాటు నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌రోవైపు లివింగ్‌స్టోన్ 7 మ్యాచ్‌లు ఆడి 87 ప‌రుగులు చేశాడు.చ‌ద‌వండి: PBKS vs RCB: నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్‌ కోహ్లి

Pope Francis Passed Away Vatican says in video statement4
Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

వాటికన్‌ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్‌ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్‌ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్‌ బెనెడిక్ట్‌-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్‌ కేథలిక్‌ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్‌ ఫ్రాన్సిస్‌ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్‌, ఇటు కమలా హారిస్‌ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్‌ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్‌ ఫ్రాన్సిస్‌.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్‌ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్‌ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Singer Pravasthi Aradhya Sensational Comments On MM Keeravani, Sunitha, Chandra Bose5
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్‌ చేశారు: లేడీ సింగర్‌ ఆవేదన

లెజండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) సింగింగ్‌ షో ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతుంది. బాలు గారి మరణానంతరం ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్‌, సింగర్‌ సునీత జడ్జీలుగా ఉన్నారు. సింగింగ్‌ రియాల్టీ షోలలో ముందంజలో ఉన్న ‘పాడుతా తీయగా’పై గాయని ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో న్యాయంగా జరగడం లేదని, టాలెంట్‌ ఉన్నవాళ్లను కాకుండా నచ్చిన వాళ్లను విజేతలుగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ షో నుంచి ఎలిమినేట్‌ అయిన ప్రవస్తి.. తాజాగా య్యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేస్తూ..కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి సీట్లలో కూర్చొని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్‌ చేశారని ఆరోపించారు.‘మ్యూజిక్‌ ఫిల్డ్‌ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్‌ అయ్యాకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ల పేర్లును ప్రస్తావించాను కాబట్టి నాకు ఎలాగో అవకాశాలు రావు. కానీ మీఅందరికి నిజం తెలియాలని ధైర్యంతో ఈ వీడియో చేశాను. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నన్ను జడ్జీలు(కీరవాణి, చంద్రబోస్‌, సునీత) మెంటల్‌గా హింసించి, అన్యాయంగా ఎలిమేట్‌ చేశారు.ముందుగా సునీత(Sunitha) గురించి చెబుతా. ఫస్ట్‌ ఎపిసోడ్‌ నుంచి కూడా నేను స్టేజ్‌ మీదకు రాగానే ఆమె ముఖం అదోలా పెట్టేవారు. నా ఫ్యాన్స్‌ కూడా నన్ను అడిగారు. ఆమెతో మీకేమైనా గొడవ జరిగిందా అని మెసేజ్‌ చేశారు. కానీ నేను అది నమ్మలేదు. కానీ అంతరామమయం పాడే ముందు నేను గమనించాను. ఆమెకు నేనంటే నచ్చదు. అందుకే తప్పు లేకున్నా నెగెటివ్‌ కామెంట్స్‌ చేసేవారు. ఓ సారి మైక్‌ ఆన్‌లో లేదని అనుకొని ‘ఈ అమ్మాయికి హైపిచ్‌ రాదు కానీ మ్యానేజ్‌ చేస్తుంది చూడు’ అని కీరవాణికి చెప్పారు. నాకు ఏడుపు వచ్చింది. కానీ తట్టుకొని అంతరామమయం పాడాను. చాలా మంది మెచ్చుకున్నారు. కానీ ఆమె మాత్రం నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారు. కానీ మిగతావారు పాడినప్పుడు మాత్రం తప్పులు జరిగితే సైగలు చేసేవారు.ఇక చంద్రబోస్‌(chandrabose) గారు.. లిరిక్స్‌ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి. మొదటి రెండు ఎపిసోడ్స్‌ నన్ను మెచ్చుకున్నారు. లిరిక్స్‌లో తప్పులు దొరకపోవడంతో నన్ను మరోలా వేధించారు.కీరవాణి.. ఆయన నుంచి నెగెటివ్‌ కామెంట్స్‌ రాలేదు. కానీ సెట్‌లో ఎలా మాట్లాడతారో చెబుతాను. మెలోడీ పాడిన వారికి ఎక్కువ మార్కులు ఇస్తానని చెబుతారు. ఆయన కంపోజ్‌ చేసిన పాటలు పాడితే మంచి మార్కులు వేస్తారు. డబ్బుల కోసం నేను వెడ్డింగ్‌ షోస్‌ చేయాల్సి వచ్చిందని గతంలో చెప్పాను. ఈ పాయింట్‌పై కీరవాణి మాట్లాడుతూ.. ‘వెడ్డింగ్‌ షోస్‌ చేసేవాళ్లు నా దృష్టిలో సింగర్సే కాదు. వాళ్లంటే నాకు అసహ్యం’ అని అన్నారు. అది చాలా హర్టింగ్‌గా అనిపించింది. అలాగే పాడుతా తీయగాలో ఐదో ఫ్రైజ్‌ సాధించినవాళ్లను నా దగ్గరకు వచ్చి చాకిరీ చేసేవాళ్ల గ్రూప్‌లో చేర్చుకుంటానని చెప్పారు. చాకిరీ అనే పదం వాడినందుకు నాకు బాధగా అనిపించింది. జడ్జీలు వివక్ష చూపడం, నన్ను చీడ పురుగులా చూడడం, నా బాడీ మీద జోకులు చేయడం..నన్ను మెంటల్‌గా ఎఫెక్ట్‌ అయ్యేలా చేశాయి.పొడ్రక్షన్‌ వాళ్లు కూడా మమ్మల్ని అవమానించారు. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్‌ చేయాలి అన్నట్లుగా చెప్పారు. చాలా సార్లు తిట్టారు. బాడీ షేమింగ్‌ చేశారు. ‘ఇలాంటి బాడీకి ఇంకేం ఇవ్వగలను’ అని కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. వీళ్ల మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. బాలు సార్‌ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి కాదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ వచ్చిందో పాడుతా తీయగా ఇలా మారిపోయింది. డ్యాన్సులు చేయమని, కుల్లు జోకులు చేయమని చెప్పారు.ఇక నా ఎలిమినేషన్‌ రోజు ఏం జరిగిందో చెబుతాను. ఆ రోజు టాప్‌ 1 వచ్చిన అమ్మాయి చంద్రబోస్‌ గారి పాట పాడింది. లిరిక్స్‌ మరిచిపోయినా చంద్రబోస్‌ గారు కామెంట్స్‌లో అది చెప్పలేదు. ఇంకో అబ్బాయి కీరవాణి పాట పాడితే స్కోర్‌ ఎక్కువ వేశారు. ఎలిమేషన్‌ రౌండ్‌లో జరిగింది ఇది. ఎలిమినేషన్‌ జరిగినప్పుడు కీరవాణి, చంద్రబోస్‌ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. సునీత మాత్రం అక్కడే నవ్వుతూ కూర్చున్నారు. ఎలిమేట్‌ అయ్యాక.. నేను ఎమోషనల్‌ అయ్యాను. మా అమ్మ సునీత దగ్గరకు వచ్చి ‘ఎందుకు ఇంత అన్యాయం చేశారు’ అని అడిగితే..‘నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో’అని సీరియస్‌గా అన్నారు. నేను చాలా షోస్‌ చేశాను కానీ ఏ జడ్జి కూడా ఇలా మాట్లాడలేదు.నేను ఈ కెరీయర్‌ వదిలేద్దామని డిసైడ్‌ అయ్యాకే ఈ వీడియో చేశాను. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటపెట్టాను. నాకు ఎలాగో అవకాశం రాదు. మీ అందరికి చెప్పేది ఒక్కటే ఇలాంటి ఫేక్‌ షోస్‌ చూడడం మానేయండి. నాలాగే చాలా మంది సఫర్‌ అయ్యారు. జడ్జిలు ఆ సీటులో కూర్చొని అన్యాయం చేసి సరస్వతి దేవిని అవమానించకండి. చిత్రమ్మ, మనోగారు, శైలజగారు ఉంటే చాలా బాగుంటుంది. మాలాంటి జీవితాలతో ఆడుకోకండి. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా కీరవాణి, చంద్రబోస్‌, సునీతతో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ వాళ్లదే బాధ్యత’ అని సింగర్‌ ప్రవస్తి పేర్కొంది.

Congress Rahul Gandhi Sensational Allegations On EC At  Boston6
Boston: ఈసీపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్‌ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్‌ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్‌ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌.. సోమవారం బ్రౌన్‌ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్‌ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్‌ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్‌ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

Meet Khushboo Patani Dishas Sister once worked Indian Army7
వాడికి భయపడి పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో దాక్కుంది..కట్‌ చేస్తే ఆర్మీ మేజర్‌!

బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్‌ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్‌ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్‌ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్‌నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్‌కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్‌రూమ్‌లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్‌ స్టోరీపట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్‌సీలో జాబ్‌ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూ​​కి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్‌గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్‌నెస్ కోచ్‌గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్‌ కూడాసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది.

Karnataka EX DGP Om Prakash Case: Schizophrenic Pallavi Really Did This8
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం​ ప్రకాశ్‌(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్‌ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్‌ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్‌ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్‌.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.‌ ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరె‍స్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్‌ బీ దయానంద్‌ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఓం ప్రకాశ్‌ స్వస్థలం బిహార్‌లోని చంపారన్‌. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్‌ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్‌ ఫినిష్డ్‌ మాన్‌స్టర్‌’ అంటూ ఫోనులో మెసేజ్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది.

Wine Shops And Bars Closed In Hyderabad9
మందు బాబులకు బిగ్‌ అలర్ట్‌.. నాలుగు రోజులు వైన్స్‌ బంద్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మందు బాబులకు అలర్ట్‌. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు వైన్‌ షాపులు బంద్‌ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసి వేయనున్నారు.ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈనెల 25వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ ఉంది. కౌంటింగ్‌ రోజు కూడా వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

Vehicles In Delhi That Dont Display Colour Coded Fuel Stickers To Be Penalised10
వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా

ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను తప్పకుండా అంటించాలి. ఈ నియమాన్ని అతిక్రమించిన వాహనాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ వెల్లడించింది.నిబంధనలు పాటించకపోతే మోటారు వాహన చట్టం కింద రూ. 5000 జరిమానా విధిస్తారు. ఈ స్టిక్కర్లు 2012-13లో ప్రవేశపెట్టబడిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP)లో భాగంగా తీసుకొచ్చారు. ఆ తరువాత 2019 నాటికి అన్ని వాహనాలను ఈ స్టిక్కర్లు తప్పనిసరి అంటూ ఢిల్లీ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లను అతికించని వాహనదారులు జరిమానా చెల్లించడం మాత్రమే కాకుండా.. పొల్యూషన్ సర్టిఫికెట్ (PUCC) కూడా పొందలేరు. నిబంధనల ప్రకారం, డీజిల్ వాహనాలకు నారింజ రంగు స్టిక్కర్లు, పెట్రోల్ & సీఎన్‌జీ వాహనాలకు లేత నీలం రంగు స్టిక్కర్లు.. మిగిలిన అన్ని వాహనాలకు బూడిద రంగు స్టిక్కర్లు తప్పనిసరిగా అతికించాలి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement