dattatreya hosabale
-
మతాధారిత రిజర్వేషన్లు... రాజ్యాంగ ఉల్లంఘనే
బెంగళూరు: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె తెలిపారు. ఇలాంటి రిజర్వేషన్లు రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కేటాయించాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణాయక విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ మూడు రోజుల భేటీ ముగిసిన అనంతరం ఆదివారం హొసబలె బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన ప్రయత్నాలను హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఆదర్శమూర్తిగా మార్చారే తప్ప, పరమత సహనాన్ని బోధించిన ఆయన పెద్ద సోదరుడు దారా షికోను పట్టించుకోవడం లేదన్నారు. భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారిని కీర్తించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘దురాక్రమణదారు మనస్తత్వం కలిగిన వారు దేశానికి ప్రమాదకరం, భారతీయ సంప్రదాయాన్ని గౌరవించే వారికి మనం మద్దతుగా నిలుద్దాం’అని హొసబలె పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు హొసబలె.. ప్రతిదీ సజావుగానే నడుస్తున్నందున ఆ అవసరమే లేదని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వానికి నిత్యం జరిగే అంశాల గురించి సంఘ్ ఏమీ చెప్పదు. ప్రజలేవైనా కొన్ని విషయాలపై ఆందోళన వ్యక్తం చేసిన సమయాల్లో మాత్రమే ఆ పనిచేస్తుంది. వివిధ సంస్థలు, రంగాల్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఈ పనిని నెరవేరుస్తారు. వీటిపై చర్చించే యంత్రాంగం మాకుంది’అంటూ హొసబలె వివరించారు. ‘‘అయోధ్య రామాలయ నిర్మాణం ఆర్ఎస్ఎస్ ఘనత కాదు.యావత్తు హిందూ సమాజం ఘనత. హిందువనే గుర్తింపు సిగ్గుపడే విషయం కాదు. అది గర్వకారణం. హిందువంటే మతపరమైన గుర్తింపే కాదు. జాతీయత, ఆధ్యాత్మికత, నాగరికతకు కూడా సంబంధించిన గుర్తింపు’’ అన్నారు. -
హిందువులపై దాడులకు రెండు రాష్ట్రాలు ఊతం
కోయంబత్తూర్: పశ్చిమ బెంగాల్లో తగ్గిపోతున్న హిందూ జనాభా, జీహాదిస్టులు పెరిగిపోవడంపై దృష్టి సారించనున్నట్లు ఆరెస్సెస్ ప్రకటించింది. మత రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ముస్లిం ఓట్ల కోసం మమత బెనర్జీ ప్రభుత్వం దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతోందని చెప్పింది. ఆరెస్సెస్‌లో విధివిధానాలను రూపొందించే అత్యున్నత విభాగం అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. 1951లో ఈ రాష్ట్రంలో 78.45% ఉన్న హిందూ జనాభా 2011కు వచ్చే సరికి 70.54 శాతానికి పడిపోయిందని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఇది దేశ సమగ్రతకు, ఏకత్వానికి సంబంధించిందన్నారు. బెంగాల్, కేరళ ప్రభుత్వాలు హిందువులపై దాడులను ప్రోత్సహిస్తున్నాయని ఆరెస్సెస్ ఆరోపించింది. -
‘దేవుళ్ల దేశం దెయ్యాలకు నిలయంగా..’
న్యూఢిల్లీ: దేవుళ్లకు అలవాలమైన భారత దేశం కాస్త దెయ్యాల నిలయంగా మారుతోందని ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హోసబలే అన్నారు. కేరళలో జరుగుతోన్న రాజకీయ హింసను గురించి బ్యాక్వర్డ్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని, ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరుకోవాల్సిందేనని అన్నారు. ఆరెస్సెస్‌కు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తోన్న ఆయన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు హిందూ గ్రూపులు కేరళ హౌస్ ముందు నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని ప్రసంగించారు. ‘దేవుళ్లకు నిలయమైన దేశం కాస్త దెయ్యాల దేశంగా మారుతోంది. కేరళలో ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తల దారుణ హత్యలకు సంబంధించిన విషయాలను విస్తృతంగా లోకానికి తెలియజేయండి. ఈహింసను చేస్తుంది సీపీఎం’ అని హోసబలే ఆరోపించారు. ఈ హత్యలపై తాము ఎంతో చెప్పామని, కానీ మీడియా మాత్రం ఆ విషయాలు చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.