హిందువులపై దాడులకు రెండు రాష్ట్రాలు ఊతం
కోయంబత్తూర్: పశ్చిమ బెంగాల్‌లో తగ్గిపోతున్న హిందూ జనాభా, జీహాదిస్టులు పెరిగిపోవడంపై దృష్టి సారించనున్నట్లు ఆరెస్సెస్ ప్రకటించింది. మత రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ముస్లిం ఓట్ల కోసం మమత బెనర్జీ ప్రభుత్వం దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతోందని చెప్పింది. ఆరెస్సెస్‌లో విధివిధానాలను రూపొందించే అత్యున్నత విభాగం అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు.
1951లో ఈ రాష్ట్రంలో 78.45% ఉన్న హిందూ జనాభా 2011కు వచ్చే సరికి 70.54 శాతానికి పడిపోయిందని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఇది దేశ సమగ్రతకు, ఏకత్వానికి సంబంధించిందన్నారు. బెంగాల్, కేరళ ప్రభుత్వాలు హిందువులపై దాడులను ప్రోత్సహిస్తున్నాయని ఆరెస్సెస్ ఆరోపించింది.