Guru Dakshina
-
ఆధ్యాత్మికథ : ధర్మనిష్ఠ
అది ఒక గురుకులం. ఒక శిష్యుడికి శిక్షణ పూర్తయింది. గురువుగారు అతన్ని పిలిచి ‘‘నాయనా! ఇక నీ శిక్షణ పూర్తయింది. నీవిక వెళ్లి, గృహస్థాశ్రమం స్వీకరించి, నీ విద్యలన్నిటినీ లోకకల్యాణానికి ఉపయోగించు.’’ అని చెప్పాడు.. ఆ శిష్యుడు చాలా పేదవాడు. అయినప్పటికీ, గురువుగారికి ఎంతో కొంత దక్షిణ చెల్లించా లనుకుని గురువుగారిని అడిగాడు దక్షిణ ఏమి కావాలని. అతని గురించి తెలిసిన గురువుగారు ‘‘నాకేమీ వద్దు’’ అని చెప్పారు. అయినా సరే, వదలకుండా పదే పదే అడుగుతుండడంతో విసిగిపోయిన గురువు ‘‘నీకు నేను 14 విద్యలను నేర్పాను. ఒక్కో విద్యకూ లక్ష బంగారు నాణాల చొప్పున పద్నాలుగు లక్షల బంగారు నాణాలు చెల్లించు’’ అని చెప్పాడు.గురుదక్షిణ చెల్లించాలన్న సంకల్పమే తప్ప దానిని ఎలా సమకూర్చుకోవాలో తెలియని ఆ శిష్యుడు కౌత్సుడు. అయితే, రాజు తండ్రి వంటి వాడు కాబట్టి రాజునే అడుగుదామనుకుని నేరుగా రాజు వద్దకు వెళ్లాడు. ఆ రాజు రఘువు. మహాపరాక్రమవంతుడు, ధర్మనిష్టాగరిష్ఠుడు. ఆడిన మాట తప్పనివాడు. కౌత్సుడు ఆయన వద్దకు వెళ్లడానికి ముందురోజే ఆయన విశ్వజీ అనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ నియమంగా తనకున్న సర్వస్వాన్నీ దానం చేశాడు. కౌత్సుడు వెళ్లేసరికి ఆయన మట్టిపిడతలతోనే సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అది గమనించిన కౌత్సుడు ఏమీ అడగకుండానే వెనుదిరగబోతుండగా, రఘుమహారాజు అతన్ని ఉండమన్నట్లుగా సైగ చేసి, సంధ్యావందనం ముగియగానే ఏం కావాలని అడిగాడు. గురుదక్షిణ చెల్లించడానికి తనకు 14 లక్షల బంగారు నాణాలు కావాలన్నాడు కౌత్సుడు. ఎవరినీ ఖాళీ చేతులతో పంపకూడదన్న నియమం కలవాడైన ఆ రాజు ‘‘అలాగే ఇస్తాను కానీ, ప్రస్తుతానికి లేవు కాబట్టి రేపు ఉదయం వచ్చి తీసుకు వెళ్లు’’ అని చెప్పాడు. సరేనంటూ సంతోషంగా సెలవు తీసుకున్నాడు కౌత్సుడు. తన వద్ద ధనం లేదు కాబట్టి, ఏం చేయాలో తగిన తరుణోపాయం చెప్పమని గురువైన వశిష్ఠుని అడిగాడు రఘుమహారాజు. ‘‘రాజా! నీకు కావలసిన ధనాన్ని సమకూర్చగల సమర్థుడు ఇంద్రుడొక్కడే. కాబట్టి వెంటనే ఇంద్రుని మీద దండెత్తడమే ఉత్తమం’’అని సలహా ఇచ్చాడు వశిష్టుడు. గురువు సలహా మేరకు వెంటనే ఇంద్రుని మీద యుద్ధం చేస్తున్నట్లుగా భేరీలు మోగించాడు రఘువు. ఆ భేరీ నాదాలు అయోధ్యా నగరం నుంచి వస్తున్నాయని తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే ధర్మపరాయణుడు, పరాక్రమవంతుడు అయిన రఘుమహారాజుకు కోపం తెప్పించడం కంటే ఆయనతో సంధి చేసుకోవడమే మేలని, దిక్పాలకులను ఆదేశించి, ఆ రాజ్యమంతటా బంగారు వర్షం కురిపించాడు. కొద్దిసేపటిలోనే కోశాగారమంతా నిండి, రాజ్యమంతటా బంగారు నాణాలతో నిండిపోయింది. దాంతో వెంటనే ఇంద్రునిపై యుద్ధం విరమిస్తున్నట్లు ప్రకటించి రఘుమహారాజు, కౌత్సుడిని పిలిపించి, నీవడిగిన ధనం కోశాగారంలో ఉంది తీసుకు పొమ్మని చెప్పాడు. తనకు కావలసిన దానికన్నా ఎక్కువ ధనం ఉందని తెలుసుకున్న కౌత్సుడు తనకు కావలసినంత మాత్రమే తీసుకుని వెళ్లి, గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మిగిలిన ధనమంతటినీ ఇంద్రుడికి తిరిగి పంపించేశాడు రఘువు. అంతటి ధర్మాత్ముడైన రఘు వంశంలో పుట్టిన వాడు కాబట్టే రాముడికి ఆయన గుణాలన్నీ అలవడ్డాయి. – డి.వి.ఆర్. -
‘దిబ్బరొట్టె చేయడం నేర్పినందుకు గురుదక్షిణ’
సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పాక శాస్త్ర ప్రావీణ్యంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వికాస్. లాక్డౌన్ నేపథ్యంలో ఈ స్టార్ చెఫ్ పేదలకు తన వంతు సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వికాస్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలయ్యింది. ‘‘స్ట్రీట్ బైట్’ యూట్యూబ్ చానెల్ ద్వారా నాకు మాస్టర్ చెఫ్ సత్యం పరిచయం అయ్యారు. ఈ చానెల్లో వచ్చిన సత్యం గారి వీడియో చూసి నేను దిబ్బ రొట్టె చేయడం ఎలాగో నేర్చుకున్నాను. ఈ క్రమంలో నేను నా గురువు సత్యం గారికి గురుదక్షిణ సమర్పించాలనుకుంటున్నాను. దయచేసి ఆయనకు సంబంధించిన వివరాలు తెలియజేయండి అంటూ వికాస్ ట్వీట్ చేశారు. URGENT- Plz Share-Andhra Pradesh ThankU @street_byte 4 introducing me 2 MasterChef Satyam💕 I learnt technique of Dibba Roti by watching him years ago Plz help me reach out to him asap This is the true heritage of our country and we have to protect these treasures. #GuruDakshinā pic.twitter.com/rlmZrfFolo — Vikas Khanna (@TheVikasKhanna) May 11, 2020 కొద్ది గంటల్లోనే ఈ ట్వీట్ వేలాది లైక్లు, షేర్లు సంపాదించింది. అంతేకాక 24 గంటల్లోనే సదరు సత్యం వివరాలను రీట్వీట్ చేశారు ట్విటర్ ఫాలోవర్లు. తన గురువు గారి వివరాలు తెలియజేసిందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు వికాస్ ఖన్నా. Thank you all. We have found MASTERCHEF Satyam,72 who taught me Dibba Roti technique (thru youtube) Need trustworthy source to deliver ration to Yeagi Ravithi Satyanarayana Near Satya hospital Deavuni Thota Palakollu, West Godavari District Andhra Pradesh 534260 info@vkhanna.com pic.twitter.com/JVy9r1wZ9T — Vikas Khanna (@TheVikasKhanna) May 11, 2020 -
అర్జునుడి గురుదక్షిణ
పురానీతి భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణుడు. తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేసేవాడు. భరద్వాజుడికి పాంచాల దేశాధీశుడు పృషతుడు చిరకాల మిత్రుడు. తన కొడుకు ద్రుపదుడిని భరద్వాజుడి ఆశ్రమంలో చేర్చాడు. ద్రోణుడు, ద్రుపదుడు సహాధ్యాయులుగా విద్యాభ్యాసం చేసేవారు. కొంతకాలానికి పృషతుడు కాలం చేయడంతో ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్లి, పట్టాభిషిక్తుడై రాజ్యభారం మోయాల్సి వచ్చింది. అస్త్రవిద్యపై ఆసక్తి గల ద్రోణుడు తండ్రి వద్ద విద్యాభ్యాసం చాలించుకున్న తర్వాత అగ్నివేశుడనే ముని వద్ద చేరి అస్త్రవిద్యను అభ్యసించాడు. ద్రోణుడి శుశ్రూషకు అగ్నివేశుడు సంతసిల్లాడు. ద్రోణుడికి ధనుర్వేదాన్ని ఆమూలాగ్రంగా నేర్పించాడు. అగ్నివేశుడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ద్రోణుడికి భరద్వాజుడు కృపి అనే కన్యతో వివాహం జరిపించాడు. వారికి అశ్వత్థామ అనే కొడుకు కలిగాడు. సంసారభారం మీద పడటంతో ద్రోణుడికి ద్రవ్యార్జన అనివార్యంగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ద్రోణుడికి పరిస్థితులు కలసిరావడం లేదు. క్షత్రియులను నిర్జించిన పరశురాముడు సంపదనంతా బ్రాహ్మణులకు పంచిపెడుతున్నట్లు విన్న ద్రోణుడు. పరశురాముడిని వెదుక్కుంటూ బయలుదేరాడు. మహేంద్రగిరిపై తపోనిష్టలో ఉన్న పరశురాముడిని కలుసుకున్నాడు. ‘ఎవరివి నీవు? ఎందుకు వచ్చావు?’ అని పరశురాముడు ప్రశ్నించగా, ‘నేను భరద్వాజుడి కుమారుడను. విత్తాపేక్షతో వచ్చాను’ అని బదులిచ్చాడు ద్రోణుడు. అందుకు పరశురాముడు చాలా విచారించాడు. ‘తరుణం మించిన తర్వాత వచ్చావు నీవు. నా వద్దనున్న సంపదనంతా ఇతరులకు పంచిపెట్టేశాను. నా వద్ద ప్రస్తుతం దివ్యాస్త్ర శస్త్రాలు తప్ప మరేమీ లేవు’ అని అన్నాడు. ‘మహాత్మా! వాటినే అనుగ్రహించండి’ అని పలికిన ద్రోణుడు పరశురాముడి నుంచి అస్త్ర శస్త్రాలను తీసుకుని ఇంటికి వచ్చాడు. అస్త్రశస్త్రాలు ఆకలి తీర్చలేవు కదా! ఇంట్లో పసిబాలుడైన అశ్వత్థామ ఆకలికి అల్లాడిపోతున్నాడు. అలాంటి విపత్కర పరిస్థితిలో ద్రోణుడికి బాల్యమిత్రుడైన ద్రుపదుడు గుర్తుకొచ్చాడు. సహాయం చేస్తాడనే ఆపేక్షతో పాంచాల రాజధానికి బయలుదేరాడు. ద్రుపదుడి సభకు వెళ్లాడు. ద్రోణుడెవరో గుర్తించనట్లే నటించాడు ద్రుపదుడు. ద్రోణుడు తనను తాను పరిచయం చేసుకుని, బాల్యస్మృతులను గుర్తుచేస్తే, ‘మహారాజునైన నేనెక్కడ. దరిద్రుడవైన నీవెక్కడ’ అంటూ తూలనాడాడు. అవమాన భారంతో ద్రోణుడు వెనుదిరిగాడు. కొంతకాలం గడిచాక బావమరిది అయిన కృపాచార్యుడి సహాయంతో ధృతరాష్ట్రుడి వద్ద కొలువు పొందాడు. పాండు తనయులకు, కౌరవులకు అస్త్రవిద్య నేర్పించాడు. వారిలో పాండవ మధ్యముడు అర్జునుడు మేటిగా తయారయ్యాడు. గురుదక్షిణ ఏమివ్వాలని కోరారు శిష్యులు. ద్రుపదుడు తనకు చేసిన అవమానాన్ని వివరించి, అతడికి గుణపాఠం చెబితే చాలన్నాడు ద్రోణుడు. పాండవులు, కౌరవులు అస్త్రధారులై పాంచాల దేశాన్ని ముట్టడించారు. ద్రుపదుడు స్వయంగా రణరంగంలోకి దిగి వీరవిహారం మొదలుపెట్టాడు. కౌరవులు అతడి ధాటికి తాళలేక పరుగులు తీశారు. పరిస్థితిని గమనించిన అర్జునుడు నేరుగా ద్రుపదుడితో తలపడ్డాడు. ద్రుపదుడిని నిరాయుధుడిగా చేసి పట్టి బంధించి తెచ్చి ద్రోణుడి సమక్షంలో నిలిపాడు. ‘గురూత్తమా! ఇదిగో నా గురుదక్షిణ’ అని పలికాడు. ద్రోణుడు విజయ దరహాసం చిందిస్తూ ద్రుపదుడిని తేరిపార చూశాడు. ‘ఓహో! ద్రుపద మహారాజా! ఇప్పటికైనా మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొందురా?’ అని పలికాడు. అవమాన భారంతో తలదించుకున్నాడు ద్రుపదుడు. ‘ఇకనైనా బ్రాహ్మణులను అవమానించకు’ అని హితవు పలికి అతడిని విడిచిపుచ్చాడు ద్రోణుడు.