kidney issues
-
ఏ ఇంటి తలుపు తట్టినా... గుండెల్ని పిండేసే ఉద్దానం కథలు
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ఇల్లు అమ్మేశాం భర్తే సర్వస్వంగా భావించి తన ఐదో తనాన్ని కాపాడుకునేందుకు నీడనిచ్చే ఇంటిని అమ్మేసి అతడిని రక్షించుకునే పనిలో పడింది ఈ ఇల్లాలు. ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన కోనేటి తులసీరావు, దమయంతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒకరి కొకరు కంటి పాపల్లా బతుకుతున్నారు. విసనకర్రలు తయారు చేస్తూ ఊరూరా తిరిగి అమ్ముతూ, వచ్చే ఆదాయంతో కడుపునింపుకునేవారు. అయితే ఈ దంపతులపై కిడ్నీ భూతం పంజా విసిరింది. ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురైన తులసీరావును రక్షించుకునేందుకు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో భర్తను చేరి్పంచింది. ఖరీదైన వైద్యం కోసం భార్య దమయంతి రెండు ఇళ్లను అమ్మేసింది. 8 నెలలు నుంచి వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర మందులతో ఇబ్బంది పడుతున్న భర్త బాధను చూడలేక ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని సైతం తాకట్టుపెట్టింది. రోజుకు పది విసనకర్రలు తయారు చేసి అమ్మితే రూ.100లు వస్తుందని, అయితే ఆ డబ్బులు మందులకే సరిపోవడం లేదని వాపోతోంది.ఉన్నదంతా వైద్యానికే ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఆయన పేరు నందూరి విజయ భూషణ్. ఛండీగడ్‌లో కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్న దశలో కిడ్నీ మహమ్మారికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. రూ.లక్షలు అప్పులు చేసి నెలకు రూ.20 వేలు చొప్పున చెల్లించి ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి కేవలం ఆటో ఖర్చులే రూ.600 వరకు అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆటో ఖర్చులకే అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్లముందు అప్పులు కనిపిస్తుంటే తమ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మునుపటిలా 108 వాహనం ద్వారా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం, రావడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాడు.ఇదీ చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?నాడు భర్త, కొడుకు – నేడు తల్లి కవిటి మండలం బొరివంక గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఈమె పేరు బలగ కామాక్షి. భర్త తలయారీగా పనిచేస్తూ పన్నెండేళ్ల కిత్రం మూత్రపిండాల వ్యాధితో మృతి చెందగా, తండ్రి ఉద్యోగాన్ని సంపాదించిన కొడుకు బాలరాజు తల్లితో పాటు భార్య, పిల్లలను సాకుతూ వచ్చాడు. విధి ఆడిన వింత నాటకంలో కొడుకు బాలరాజు సైతం కిడ్నీవ్యాధి బారినపడ్డాడు. కొడుకు వైద్యం కోసం తల్లి అప్పులు చేసినా ఎంతో కాలం బతకలేదు. ఈ పిరిస్థితుల్లో కోడలు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదిగొచ్చిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత కామాక్షిపై పడింది. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేసిన కామాక్షి, ఇప్పుడు తాను సైతం కిడ్నీ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నెలకు సుమారు రూ.10 వేలు వరకు వైద్యానికే ఖర్చవుతోందని, ప్రభుత్వం వితంతు పింఛన్ మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది -
నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం(ఫిబ్రవరి 21న) ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రికి తరలించారు. ప్రభుని పరీక్షించిన వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించారు. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రభు ఆర్యోగం ప్రస్తుతం నిలకడగా ఉందని, లేజర్ సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలో రాళ్లను తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా తమిళ నటుడైన ప్రభు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడు. తెలుగులో ఆయన చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రభాస్‌కు డార్లింగ్ చిత్రంలో ఆయన పోషించిన తండ్రి పాత్ర తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇటీవల ప్రభు దళపతి విజయ్ వారసుడు చిత్రంలో కనింపించారు. ప్రస్తుతం ఆయన తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చదవండి: హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా.. కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి -
బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడికి అవకాశం ఉందా?
నా వయసు 40 ఏళ్లు. టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూత్రపిండాల సమస్య ఉంది. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కిడ్నీ మార్పిడి చేయించుకోవడం మంచిదని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందా? మా కుటుంబ సభ్యులు నాకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో ఎవరితో నా బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. నాకు కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. కిడ్నీలు పూర్తిగా పాడై డయాలసిస్‌పై ఆధారపడుతున్నా వారికి కిడ్నీ మార్పిడి ఉత్తమమైన మార్గం. మీరు రెండు పద్ధతుల ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు. ఒకటి స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్. రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మీలాంటి సమస్యతోనే బాధపడుతున్న మరొకరు ఉంటే... వారి కుటుంబ సభ్యులతో మీ బ్లడ్ మ్యాచ్ అయితే... వారి కుటుంబసభ్యులు మీకూ... మీ కుటుంబ సభ్యులు వారికీ... ఇలా దాతలను పరస్పరం మార్చుకొని... ఇరువురు బాధితులూ కిడ్నీలు పొంది, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు అత్యాధునికమైన ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చింది. దాని వల్ల బ్లడ్‌గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరాసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్గ్రూపులలోని యాంటీజెన్‌ను కలిసేలా చేస్తారు.ఏబీఓ ఇనకంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నవారు కూడా కంపాటబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. కాళ్లవాపులు వస్తున్నాయి... ఇది కిడ్నీ సమస్యా? నా వయసు 54 ఏళ్లు. రెండేళ్లుగా డయాబెటిస్ ఉంది. దాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం కొంతకాలంగా మందులు వాడుతూ, ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాను. ఇటీవల నాకు కాళ్లలో వాపు వస్తోంది. దాంతోపాటు మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. డయాబెటిస్ ఉండే కాళ్లవాపు వస్తుందా? ఈ లక్షణాలతో నాకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. ఇది కిడ్నీ సమస్యకు సూచన కావచ్చా? దాంతో సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కాళ్ల వాపులతో పాటు ముఖం వాచినట్లు ఉండటం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూసుకోండి. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యలను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీ సమస్యలకు మంచి మందులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కీడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయగలగడంతో పాటు సాధారణ జీవితం గడపగలుగుతారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ, వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మీకు డయాబెటిస్ ఉన్నందున మీరు సాధ్యమైనంతవరకు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్‌ఫుడ్, ఫాస్ట్ఫుడ్స్, నూనె పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీ ఎత్తుకు తగిన విధంగా మీ శరీర బరువు ఉండేలా చూసుకోండి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. హాస్పిటల్లో డయాలసిస్ బదులుగా ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? నా వయసు 53 ఏళ్లు. టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న నాకు రెండు మూత్రపిండాలూ పాడైపోయాయి. చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందని ఇటీవలే తెలిసింది. దాని గురించి వివరించండి. ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. అత్యధికులు అనుసరించేది కూడా ఇదే. అయితే మీరు రెగ్యులర్‌గా డయాలసిస్ కోసం ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున, ఇంటి దగ్గర మీరే స్వయంగా, మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. దీన్ని ఇంటిదగ్గర, ఆఫీసులో, ప్రయాణాల్లో స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి డయాలసిస్ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్స్ఛేంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే బ్యాగులో చేరిన వ్యర్థ ద్రవాన్ని ఖాళీ చేయవచ్చు. డా. ఎమ్. దిలీప్‌బాబు,సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ, హైదరాబాద్ -
మెరుగైన వైద్యమందిస్తాం
⇒ గురుజ గ్రామాన్ని సందర్శించిన ఆరోగ్యశ్రీ బృందం ⇒ కిడ్నీ బాధితులకు పరీక్షలు - త్వరలో వైద్య నిపుణులతో చికిత్స ⇒ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు గుడిహత్నూర్ : ‘ఉసురు తీస్తోంది..’ శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించారు. మండలంలోని మన్నూర్ గ్రామ పంచాయతీ పరిధి గురుజలో కిడ్నీ వ్యాధితో బాధితులు మృత్యువాత పడుతున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఆరోగ్యశ్రీ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ డాక్టర్ బాలకోటయ్య స్పందించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ శ్యాంసుందర్, టీంలీడర్ వ్యాస్, ఆరోగ్యమిత్ర ఉల్లాస్ శనివారం గురుజ గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటికీ తిరిగి బాధితులను పరీక్షించి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. బాధితులు శంకర్, ఫక్రూజీ, ఫకీరాలతోపాటు పలువురు బాధితులతో మాట్లాడారు. చనిపోయిన విద్యార్థి నిఖిల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. బాధితులకు సంబంధించి వైద్యులు ఇచ్చిన రిపోర్టులు పరిశీలించారు. వ్యాధి ప్రబలడానికి గల కారణాలను రాబట్టే ప్రయత్నం చేశారు. గ్రామంలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు బృందం సభ్యులు తెలిపారు. రక్తపోటు ఎలా అదుపులో ఉంచుకోవాలి, రాకుండా ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, కిడ్నీలపై దాని ప్రభావం ఎలా పడుతుందో తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వచ్చే వారంలో హైదరాబాద్ నుంచి కిడ్నీ వైద్య నిపుణులను రప్పించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. కాగా, గ్రామస్తుల కిడ్నీ వ్యాధి, మరణాలపై వెలుగులోకి తెచ్చి ఉన్నతాధికారులు, వైద్యుల దృష్టికి తీసుకెళ్లిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.