⇒ గురుజ గ్రామాన్ని సందర్శించిన ఆరోగ్యశ్రీ బృందం
⇒ కిడ్నీ బాధితులకు పరీక్షలు - త్వరలో వైద్య నిపుణులతో చికిత్స
⇒ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబాలు
గుడిహత్నూర్ : ‘ఉసురు తీస్తోంది..’ శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించారు. మండలంలోని మన్నూర్ గ్రామ పంచాయతీ పరిధి గురుజలో కిడ్నీ వ్యాధితో బాధితులు మృత్యువాత పడుతున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఆరోగ్యశ్రీ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ డాక్టర్ బాలకోటయ్య స్పందించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ శ్యాంసుందర్, టీంలీడర్ వ్యాస్, ఆరోగ్యమిత్ర ఉల్లాస్ శనివారం గురుజ గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటికీ తిరిగి బాధితులను పరీక్షించి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. బాధితులు శంకర్, ఫక్రూజీ, ఫకీరాలతోపాటు పలువురు బాధితులతో మాట్లాడారు. చనిపోయిన విద్యార్థి నిఖిల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు.
బాధితులకు సంబంధించి వైద్యులు ఇచ్చిన రిపోర్టులు పరిశీలించారు. వ్యాధి ప్రబలడానికి గల కారణాలను రాబట్టే ప్రయత్నం చేశారు. గ్రామంలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు బృందం సభ్యులు తెలిపారు. రక్తపోటు ఎలా అదుపులో ఉంచుకోవాలి, రాకుండా ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, కిడ్నీలపై దాని ప్రభావం ఎలా పడుతుందో తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వచ్చే వారంలో హైదరాబాద్ నుంచి కిడ్నీ వైద్య నిపుణులను రప్పించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. కాగా, గ్రామస్తుల కిడ్నీ వ్యాధి, మరణాలపై వెలుగులోకి తెచ్చి ఉన్నతాధికారులు, వైద్యుల దృష్టికి తీసుకెళ్లిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
మెరుగైన వైద్యమందిస్తాం
Published Sun, Feb 26 2017 8:13 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement