బ్లడ్‌ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడికి అవకాశం ఉందా? | You can cross the kidney by two methods | Sakshi
Sakshi News home page

బ్లడ్‌ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడికి అవకాశం ఉందా?

Published Mon, May 27 2019 4:35 AM | Last Updated on Mon, May 27 2019 4:35 AM

You can cross the kidney by two methods - Sakshi

నా వయసు 40 ఏళ్లు. టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూత్రపిండాల సమస్య ఉంది. రెండేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. కిడ్నీ మార్పిడి చేయించుకోవడం మంచిదని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తుందా? మా కుటుంబ సభ్యులు నాకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో ఎవరితో నా బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. నాకు కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.

కిడ్నీలు పూర్తిగా పాడై డయాలసిస్‌పై ఆధారపడుతున్నా వారికి కిడ్నీ మార్పిడి ఉత్తమమైన మార్గం. మీరు రెండు పద్ధతుల ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు. ఒకటి స్వాప్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌. రెండోది ఏబీఓ ఇన్‌కంపాటబుల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌. స్వాప్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మీలాంటి సమస్యతోనే బాధపడుతున్న మరొకరు ఉంటే... వారి కుటుంబ సభ్యులతో మీ బ్లడ్‌ మ్యాచ్‌ అయితే... వారి కుటుంబసభ్యులు మీకూ... మీ కుటుంబ సభ్యులు వారికీ... ఇలా దాతలను పరస్పరం మార్చుకొని... ఇరువురు బాధితులూ కిడ్నీలు పొంది, కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకోవచ్చు.

అయితే ఇప్పుడు అత్యాధునికమైన ఏబీఓ ఇన్‌కంపాటబుల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అందుబాటులోకి వచ్చింది. దాని వల్ల బ్లడ్‌గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరాసిస్‌ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్‌గ్రూపులలోని యాంటీజెన్‌ను కలిసేలా చేస్తారు.ఏబీఓ ఇనకంపాటబుల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నవారు కూడా కంపాటబుల్‌ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు.

కాళ్లవాపులు వస్తున్నాయి... ఇది కిడ్నీ సమస్యా?

నా వయసు 54 ఏళ్లు. రెండేళ్లుగా డయాబెటిస్‌ ఉంది. దాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం కొంతకాలంగా మందులు వాడుతూ, ఇన్సులిన్‌ కూడా తీసుకుంటున్నాను. ఇటీవల నాకు కాళ్లలో వాపు వస్తోంది. దాంతోపాటు మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. డయాబెటిస్‌ ఉండే కాళ్లవాపు వస్తుందా? ఈ లక్షణాలతో నాకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. ఇది కిడ్నీ సమస్యకు సూచన కావచ్చా? దాంతో సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.

మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కాళ్ల వాపులతో పాటు ముఖం వాచినట్లు ఉండటం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూసుకోండి. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యలను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీ సమస్యలకు మంచి మందులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి.

కీడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయగలగడంతో పాటు సాధారణ జీవితం గడపగలుగుతారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ, వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మీకు డయాబెటిస్‌ ఉన్నందున మీరు సాధ్యమైనంతవరకు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్స్, నూనె పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీ ఎత్తుకు తగిన విధంగా మీ శరీర బరువు ఉండేలా చూసుకోండి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.

హాస్పిటల్‌లో డయాలసిస్‌ బదులుగా ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా?

నా వయసు 53 ఏళ్లు. టైప్‌–2 డయాబెటిస్‌తో బాధపడుతున్న నాకు రెండు మూత్రపిండాలూ పాడైపోయాయి. చాలాకాలంగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందని ఇటీవలే తెలిసింది. దాని గురించి వివరించండి.

ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్‌ అంటారు. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. అత్యధికులు అనుసరించేది కూడా ఇదే. అయితే మీరు రెగ్యులర్‌గా డయాలసిస్‌ కోసం ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున, ఇంటి దగ్గర మీరే స్వయంగా, మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్‌ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్‌ డయాలసిస్‌. దీన్ని ఇంటిదగ్గర, ఆఫీసులో, ప్రయాణాల్లో స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర డయాలసిస్‌ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి.

పెరిటోనియల్‌ డయాలసిస్‌ ద్వారా కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్‌ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్‌ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి డయాలసిస్‌ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్‌ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్‌ అవుతుంది.

కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్స్ఛేంజ్‌ అంటారు. రాత్రివేళ పేషెంట్‌ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్‌ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్‌ తనంతట తానుగా డయాలసిస్‌ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్‌ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే బ్యాగులో చేరిన వ్యర్థ ద్రవాన్ని ఖాళీ చేయవచ్చు.

డా. ఎమ్‌. దిలీప్‌బాబు,సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ అండ్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement