అలకనంద ఆస్పత్రిని సీజ్ చేస్తున్న వైద్యాధికారులు
పొరుగు రాష్ట్రాల యువతులకు డబ్బు ఆశ చూపించి గాలం
హైదరాబాద్‌లో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి చికిత్సలు
వైద్యాధికారులు, పోలీసుల తనిఖీలు..ఎలాంటి అనుమతులు లేవని గుర్తింపు
పోలీసుల అదుపులో అలకనంద ఆస్పత్రి నిర్వాహకుడు
చైతన్యపురి (హైదరాబాద్): నగరంలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. సాధారణ వైద్య చికిత్సలకు (జనరల్) మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేస్తూ రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఆస్పత్రి నిర్వాకాన్ని వైద్యాధికారులు, పోలీసులు బట్టబయలు చేశారు. ఆస్పత్రి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎంఎచ్‌ఓ, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి డాక్టర్స్ కాలనీలోని అలకనంద ఆస్పత్రిలో అనుమతుల్లేకుండా కిడ్నీల మారి్పడి దందా సాగిస్తున్నన్నట్లు సమాచారం అందింది. దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎల్‌బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి మంగళవారం సాయంత్రం ఆస్పత్రిపై దాడి చేశారు.
జనరల్, ప్లాస్టిక్ సర్జరీల నిమిత్తం ఆస్పత్రి నిర్వహణకు 6 నెలల అనుమతి తీసుకున్న సుమంత్ అనే వ్యక్తి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయక యువతులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలు దానం చేసేందుకు ఒప్పిస్తున్నాడు. హైదరాబాద్‌లో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాడు. ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే చేస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారులు.. పోలీసులతో కలిసి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఇద్దరు కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులను కనుగొన్నారు.
అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకొని వైద్యులు పరారయ్యారు. దీంతో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను అధికారులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలకనంద ఆస్పత్రిని సీజ్ చేశారు. కిడ్నీ మారి్పడి చికిత్స కోసం ఒకొక్కరి నుంచి సుమారు రూ.58 లక్షలు తీసుకున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఎలాంటి అనుమతి లేకుండానే ఇతర రాష్టాల నుంచి వైద్యులను పిలిపించి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేస్తున్నట్లుగా గుర్తించినట్లు డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.
కిడ్నీ రాకెట్ ముఠాపై కఠిన చర్యలు: రాజనర్సింహ
అలకనంద ఆసుపత్రి ఉదంతంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. కిడ్నీ మారి్పళ్లకు పాల్పడిన డాక్టర్లు, ఆసుపత్రి యాజమాన్యం, ఇతర బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment