TANUKU MLA
-
ఎన్నికల నాటికి 'తణుకు' ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..?
'తెలుగుదేశం-జనసేన పొత్తు వ్యవహారంలో చాలా చోట్ల టిడిపి అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమ నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయిస్తారేమోనని టిడిపినేతలు కంగారు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో ఓ నియోజక వర్గంలో టిడిపి-జనసేన నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది నేనంటే నేనే అంటూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే జనసేన అభ్యర్ధి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో టిడిపి శ్రేణులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జనసేనకే ఆ సీటు ఇస్తే వారికి సహకరించే ప్రసక్తి లేదని టిడిపి శ్రేణులు భీష్మించుకుని ఉన్నాయంటున్నారు.' స్థానిక టీడీపీ నేతల్లో సెగలు..! తణుకు నియోజకవర్గం నుండి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టిడిపికి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తణుకు నుంచే పోటీ చేయాలని ఆరిమిల్లి భావిస్తున్నారు. అయితే ఆ మధ్య వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తణుకు సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తణుకు నుండి తమ పార్టీ తరపున విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రకటించి సంచలనం సృష్టించారు. అది స్థానిక టీడీపీ నేతల్లో మంట పుట్టించింది. టిడిపి-జనసేనల మధ్య పొత్తు అప్పటికి ఖరారు కాలేదు. పొత్తు పెట్టుకుంటాం అని అన్నా కూడా సీట్ల సద్దుబాటు కాలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా విడివాడ రామచంద్రరావు పేరు ప్రకటించడం ఏంటని టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. అయితే పవన్ అలా ప్రకటించిన క్షణం నుంచి వచ్చే ఎన్నికల్లో తణుకు నియోజక వర్గంలో టిడిపి-జనసేనల తరపు అభ్యర్ధిని తానే అని విడివాడ రామచంద్రరావు ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని చెప్పుకుంటున్నారు. తణుకు సీటు నాదంటే నాదే..! ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన సందర్బంగా ఆయన విజయవాడ దాకా ర్యాలీగా వెళ్తూ తణుకు వద్ద ఆగారు. అక్కడ జనసేన అభ్యర్ధి విడివాడ రామచంద్రరావు అమాంతం వచ్చి చంద్రబాబు కాళ్లకు నమస్కరించేశారు. ఆయన్ను చంద్రబాబు కూడా ఆప్యాయంగా లేవదీసి భుజం తట్టారు. టిడిపి అభ్యర్ధి ఆరిమిల్లి కూడా చంద్రబాబుకు అభివందనం చేశారు. కానీ విడివాడ రామచంద్రరావును రిసీవ్ చేసుకున్నంత సన్నిహితంగా ఆరిమిల్లిని చంద్రబాబు రిసీవ్ చేసుకోలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. తణుకు సీటును జనసేనకు కేటాయించేసినట్లే అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆరిమిల్లి, విడివాడ ఎవరికి వారే రాబోయే ఎన్నికల్లో తణుకు సీటు నాదంటే నాదే అని తమ తమ శిబిరాల ద్వారా ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..? అని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. ఇవి చదవండి: భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం! -
ఎమ్మెల్యే కారుమూరికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విజయపురి సౌత్(మాచర్ల): తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని ఏడో మైలు చెక్‌పోస్ట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు దెబ్బతింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్తుండగా ఎత్తిపోతల అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే మాచర్ల వైపు నుంచి సాగర్ వైపు వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే..
సాక్షి, పశ్చిమ గోదావరి : ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసి కాపు ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేసినప్పుడు కూడా నోరుమెదపని పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎనభై శాతం హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వర్ రావు విమర్శించారు. వైఎస్ జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుక్లెట్ విడుదల చేయడంపై ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతి, దోపిడీ లేని పాలన అందిస్తుంటే టీడీపీ, జనసేనలకు మింగుడుపడడం లేదన్నారు. చంద్రబాబు పాలనలో ఆరు వందల హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోయినా అడగని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట్లాడటంలో ఆయన విజ్ఞత ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు కూడా పెదవి విప్పని పవన్ కల్యాణ్‌కు గత ప్రభుత్వం తొమ్మిది నెలలు ఇసుక దొరక్కుండా చేసిన విషయం తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు. రూపాయి కూడా లేకుండా చంద్రబాబు ఖజానా ఖాళీ చేసి అప్పజెప్పాడని, వైఎస్ జగన్ ఎంతో ఓర్పుతో ప్రతీ హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లుగా ఇప్పటికే ఐదు లక్షల అరవై ఉద్యోగాలు, సుమారు రెండు లక్షల గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. త్వరలో పెద్ద ఎత్తున కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. మంచి పనులు చేస్తుంటే మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా విషం చిమ్మవద్దని పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. -
చంద్రబాబు పంచాయితీతో సర్దుబాటు చేస్తారా?
-
‘ఆరిమిల్లి’ పంచాయితీ నేటికి వాయిదా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై నమోదైన కేసు విషయమై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వద్ద మంగళవారం జరగాలి్సన పంచాయితీ బుధవారానికి వాయిదా పడింది. బుధవారం కొవ్వూరులో జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని రాత్రి 7.30 గంటలకు జిల్లా ఎమ్మెల్యేలంతా అమరావతి రావాలని ముఖ్యమంత్రి సూచిం చినట్టు సమాచారం. ఇరగవరం ఎస్సై కేవీవీ శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే రాధాకృష్ణ తన కార్యాలయంలో నిర్బంధించిన నేపథ్యంలో ఎమ్మెల్యేపై కేసు నమోదైన విషయం విదితమే. దీనిని నిరసిస్తూ జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించడం, గన్మెన్లను వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే తప్పు చేస్తే సీనియర్లు అతనికి తెలియజెప్పాల్సింది పోయి వారు కూడా జిల్లా ఎస్పీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో పలచన అయ్యారు. సోమవారం పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని తాను పరిష్కస్తానని ప్రకటించారు. ఈ పరిణామాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. త్వరలో ఎస్పీల బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను బదిలీ చేయించడం ద్వారా తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన పెనుగొండ సీఐ రామారావుపై డీఐజీ రామకృష్ణ సస్పెన్షన్ వేటు వేశారు.