‘ఆరిమిల్లి’ పంచాయితీ నేటికి వాయిదా!
Published Wed, May 24 2017 1:53 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై నమోదైన కేసు విషయమై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వద్ద మంగళవారం జరగాలి్సన పంచాయితీ బుధవారానికి వాయిదా పడింది. బుధవారం కొవ్వూరులో జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని రాత్రి 7.30 గంటలకు జిల్లా ఎమ్మెల్యేలంతా అమరావతి రావాలని ముఖ్యమంత్రి సూచిం చినట్టు సమాచారం. ఇరగవరం ఎస్సై కేవీవీ శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే రాధాకృష్ణ తన కార్యాలయంలో నిర్బంధించిన నేపథ్యంలో ఎమ్మెల్యేపై కేసు నమోదైన విషయం విదితమే. దీనిని నిరసిస్తూ జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించడం, గన్‌మెన్‌లను వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే తప్పు చేస్తే సీనియర్లు అతనికి తెలియజెప్పాల్సింది పోయి వారు కూడా జిల్లా ఎస్పీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో పలచన అయ్యారు. సోమవారం పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని తాను పరిష్కస్తానని ప్రకటించారు. ఈ పరిణామాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. త్వరలో ఎస్పీల బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను బదిలీ చేయించడం ద్వారా తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన పెనుగొండ సీఐ రామారావుపై డీఐజీ రామకృష్ణ సస్పెన్షన్ వేటు వేశారు.
Advertisement