ఆత్మహత్య చేసుకున్న విక్కి, లలిత, రాంచీ
న్యూఢిల్లీ : ప్రసాదం కోసం ఆగడమే ఆ చిన్నారి చేసుకున్న అదృష్టమేమో. లేకపోతే తల్లిదండ్రులు, సోదరితో పాటు ఆ బాలుడు కూడా ఈ పాటికే మరణించేవాడు. ఆస్తి తగదాల వల్ల ఒక కుటుంబంలోని భార్యాభర్తలు, కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దక్షిణ ఢిల్లీలో జరిగింది. అదృష్టవశాత్తు కుమారుడు మాత్రం ఈ సంఘటన నుంచి తప్పించుకోగలిగాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీకి చెందిన కిషోర లాల్‌కు (74)కు ముగ్గురు కుమారులు. రాకేష్, విక్కి, రాజేష్. వీరంతా దక్షిణ ఢిల్లీలోని గోవిందపూరీలోని తమ 6 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఒక్కో ఫ్లోర్‌లో నివసిస్తున్నారు. కిషోర్ లాల్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
చిన్న కొడుకు విక్కి, అతని భార్య లలిత, కూతురు రాంచీ (6), కుమారుడు రిషబ్(3). విక్కి 2016 నుంచి అపార్టమెంట్‌లోని మొదటి, రెండో అంతస్తులను తన పేరు మీదకు బదాలయించాలని తండ్రి లాల్‌తో గొడవపడుతున్నాడు. కానీ లాల్ తాను మరణించేవరకూ ఆస్తి పంపకాలకు వీల్లేదన్నాడు. దాంతో విక్కి తన అన్న రాకేష్‌తో కలిసి తండ్రిని కొట్టారు. అంతేకాక తాను ఆత్మహత్య చేసుకుని అందుకు తండ్రే కారణమని చెప్తానని విక్కి తన తండ్రిని బెదిరించాడు. ఈ విషయం గురించి లాల్ ఢిల్లీ పోలీసు కార్యలయంలోని సీనియర్ సిటిజన్ సెల్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. శనివారం విక్కి, అతని భార్య లలిత ఆస్తి పంపకాల గురించి ముందు తన తల్లి దగ్గర ప్రస్తావించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తర్వాత తండ్రి దగ్గరకు వెళ్లి గొడవ పడ్డారు. తన కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని తండ్రిని బెదిరించారు. దాంతో లాల్ ఉదయం 10.10 గంటలకు పోలీసులకు ఫోన్ చేశాడు.
గొడవ సద్దుమణిగిన తర్వాత విక్కి తన ఇంట్లోకి వెళ్లాడు. అతని భార్య పక్క ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలను తీసుకురావడానికి వెళ్లింది. అప్పుడు కూతురు రాంచీ తల్లితో వెళ్లడానికి అంగీకరించింది. కానీ రిషబ్ మాత్రం తాను ప్రసాదం తీసుకొనే వస్తానని తల్లితో పాటు వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. పోలీసులు వచ్చే సమాయానికి విక్కి, అతని భార్య లలిత, కూతురు రాంచీ విషం మింగారు. పోలీసులు వెంటనే భార్యభర్తలను ఒక ఆస్పత్రికి, కూతుర్ని మరొక ఆస్పత్రికి తరలించారు. కానీ ముగ్గిరిలో ఒక్కరూ కూడా బతకలేదని సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమీషనర్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.
తల్లిదండ్రులు మరణించిన విషయం అర్థం కానీ రిషబ్ తన తాతనాయనమ్మలతో ఆడుకుంటున్నాడు. చిన్నారి రిషబ్‌ను తమ ఇద్దరి పిల్లలతోపాటు పెంచుకుంటానని అతని పెదనాన్న రాకేష్ తెలిపారు. అయితే విక్కి గతేడాది 2017, జనవరి 1న కూడా ఆత్యహత్యాయత్నం చేశాడని అతని సోదరులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment