న్యూఢిల్లీ: చిన్న చిన్న కారణాలతోనే విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అమ్మానాన్న తిట్టారని, మొబైల్ కొనివ్వలేదని, పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ప్రేమ విఫలమైందని, డిప్రెషన్ వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి పెద్దవాళ్ల వరకు క్షణికావేశంలో తమను తామే చంపేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది.
జేఈఈ మెయిన్స్ పరీక్షలో పాస్ కాలేదని మనస్తాపం చెందిన 17 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి తన ఇంటర్ పూర్తికాగానే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే చదువులో ఒత్తిడి కారణంగా పరీక్ష పాస్ కాలేదు. ఆమె అనుకున్న అంచనాలను చేరుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో శుక్రవారం రాత్రి షాహిన్ భాగ్‌లోని బిల్డింగ్‌లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వద్ద సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో‘ నన్ను క్షమించండి.. నేను సాధించలేకపోయాను. జేఈఈ పరీక్షను క్లియర్ చేయలేకపోయాను’ అని రాసి ఉంది. అయితే పరీక్షలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి తెలియజేసిందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ప్రైవేట్ ఉగ్యోగి కాగా, ఆమె తల్లి గృహిణి.
Comments
Please login to add a commentAdd a comment