ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ పోలీసు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన వసంత విహార్ ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హరియాణాలోని జాజర్‌కు చెందిన సందీప్ కుమార్ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లోనే ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన మిగతా సిబ్బంది సందీప్‌ను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే అతను తుదిశ్వాస విడిచారు.
అయితే సందీప్ తన ప్రాణాలు తీసుకునే ముందు ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. దీనిని పోలీసులు అతని మొబైల్ ఫోన్‌లో గుర్తించారు. అయితే ఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని వెల్లడించారు. ఆ వీడియోలో సందీప్.. ‘నేను మంచి కుమారుడిని, భర్తను, సోదరుడిని.. కాలేకపోయాను. ఇది నిజం’ అని పేర్కొన్నారు. మరోవైపు సందీప్ ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులు స్పందించడానికి నిరాకరించారు.
ఈ ఘటనకు సంబంధించి పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సందీప్ మృతదేహం ఆస్పత్రిలో ఉందని, దానిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు కరోనా నిర్ధారాణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment