ఆరిమిల్లి వివాదంపై అమరావతిలో పంచాయితీ
Published Tue, May 23 2017 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసు అధికారులను నిర్బంధించిన వివాదంపై మంగళవారం అమరావతిలో పంచాయితీ జరగనుంది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది చాలా చిన్న పంచాయితీ అని, దీన్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరంలో ప్రకటించారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కొందరు ఈ విధంగా వివాదాలకు దిగడం సరికాదన్నారు. పశ్చిమ గోదావరి రాష్ట్రంలోనే ప్రశాంతంగా ఉండే జిల్లా అని, ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు, ఎస్పీలు తమ అనుభవాలను గొప్పగా చెప్పుకుంటారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అధికారులతో వివాదం మంచిది కాదని, ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, ఎస్పీ యువకుడు, కొత్తవాడు కావడంతో ఈ వివాదం వచ్చిందన్నారు. దీనిని తాను పరిష్కరిస్తానని చెప్పారు. ఆదివారం నిర్వహించిన జిల్లా టీడీపీ విస్త్రత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఎస్పీని టార్గెట్ చేయడం, ఆ తర్వాత సమన్వయ కమిటీ సమావేశంలోనూ జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చించకుండా ఎస్పీని బదిలీ చేయాలనే అంశంపై రచ్చ చేయడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టమంటే ఒక రోజంతా ఒక అధికారి గురించి చర్చిస్తారా అని జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన పర్యటనకు ఎమ్మెల్యేలు ఎవరూ రావద్దని జిల్లా కమిటీ, అనుబంధ కమిటీలపై చర్చించి ఖరారు చేయాలని ఆదేశించారు. మంగళవారం అమరావతికి వస్తే ఈ విషయంపై చర్చిద్దామని ముఖ్యమంత్రి జిల్లా నేతలకు సూచించారు. దీంతో మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మాత్రమే ముఖ్యమంత్రి పర్యటనకు హాజరయ్యారు. మిగిలినవారంతా ఏలూరులో సమావేశమై జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చించారు.
డీజీపీ చెంతకు పోలీస్ అధికారుల సంఘం
మరోవైపు పోలీసు అధికారుల సంఘం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఎస్సై, రైటర్‌ను నిర్బంధించడమే కాకుండా, ఎస్పీని బదిలీ చేయాలని ప్రజాప్రతినిధులు పట్టుపట్టడంపై అసోసియేషన్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లేందుకు అమరావతి వెళ్లగా, డీజీపీ ఆంధ్రా, ఒడిశౠ బోర్డర్‌లో ఉండటంతో కలవడం కుదరలేదు. ముఖ్యమంత్రితోపాటు, అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలవాలని పోలీస్ అసోసియేషన్ భావిస్తోంది.
Advertisement