
మొదటి సంతకంతోనే మోసం
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకంతోనే డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు మోసం చేశారని డెమోక్రటిక్ యూత్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్‌ఐ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులతో కలిసి మంగళవారం అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, జిల్లా కన్వీనర్ కసాపురం రమేష్, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ పది నెలలు గడిచినా ముఖ్యమంత్రి మొదటి సంతకాన్ని అమలు చేసే పరిస్థితి లేనప్పుడు వారంలోనే మెగా డీఎస్సీని విడుదల చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అనేక ప్రకటనలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారన్నారు. వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అప్పటికీ దిగిరాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలను అడ్డుకుంటామన్నారు. అనంతపురం జిల్లాకు డీఎస్సీలో వెయ్యి ఎస్జీటీ పోస్టులు పెంచాలన్నారు. జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఉండేలాగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కూడా ద్వితీయ ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయాలన్నారు. అనంతరం డీఈఓ ప్రసాద్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నూరుల్లా, సురేంద్రబాబు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దు, పరమేష్, తరిమెల గిరి, భీమేష్, సాయి పాల్గొన్నారు.
నిరుద్యోగులను వంచించిన చంద్రబాబు
డీఈఓ ఆఫీస్‌ను ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థులు