ఆర్డీటీ రక్షణ బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్డీటీ రక్షణ బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకోవాలి

Published Mon, Apr 28 2025 7:14 AM | Last Updated on Mon, Apr 28 2025 7:14 AM

ఆర్డీటీ రక్షణ బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకోవాలి

ఆర్డీటీ రక్షణ బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకోవాలి

అనంతపురం కార్పొరేషన్‌: ఐదున్నర దశాబ్దాలుగా సేవలందిస్తున్న రూరల్‌ డెలవప్‌మెంట్‌ ట్రస్టు(ఆర్డీటీ) ఏపీ, తెలంగాణలోని అనేక గ్రామాలకు కల్పతరువని, అటువంటి ట్రస్టు మనుగడ కేంద్రం చర్యలతో ప్రమాదంలో పడిందని, లక్షలాది మంది పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న గొప్ప స్వచ్ఛంద సంస్థ రక్షణ బాధ్యతను సీఎం చంద్రబాబు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్డీటీ సంస్థకు ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించి సేవలు సజావుగా సాగేలా చూడాలంటూ 1969 నుంచి ఆర్డీటీ అందిస్తున్న సేవలను గుర్తు చేస్తూ.. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీకి అనంత లేఖ రాశారు. ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించకపోవడంతో ట్రస్టుపై ఆధారపడిన ఎంతో మంది జీవితాలు అగమ్యగోచరంగా మారే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బార్సిలోనాలో జన్మించి, స్పానిష్‌ ఆర్మీలో సైనికుడిగా పని చేసిన ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ మానవత్వానికి హద్దులు లేవన్న రీతిలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు కృషి చేసి కరుణామయుడిగా పేరొందారని తెలిపారు. 2009లో ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ కన్నుమూశాక..ఆయన సతీమణి అన్నేఫెర్రర్‌, కుమారుడు మాంఛో ఫెర్రర్‌ ఆర్డీటీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 3,500 గ్రామాల ప్రజలు సేవలు పొందుతున్నారని, ఆర్థికంగా వెనుకబడిన 4.5 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, సమాజ ఆరోగ్య అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. జిల్లా మొదలుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ సంస్థల మన్ననలను ఆర్డీటీ పొందిందని గుర్తు చేశారు. అనంతపురం నగర శివారులో 32 ఎకరాల్లో ఆర్డీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌ను 2002లో ప్రారంభించి.. క్రికెట్‌, హాకీ, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, జూడో, టెన్నిస్‌ తదితర క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తోందన్నారు. 1,433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2,801 ప్రాజెక్ట్‌ గ్రామాల్లో విద్యను అందిస్తోందన్నారు. 8,112 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి.. ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోందన్నారు. ఇప్పటి వరకు వెనుకబడిన వర్గాల వారికి 84,971 ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ఆర్డీటీ ఆస్పత్రిలో అన్ని వర్గాల ప్రజలకు ఆయువు పోశారన్నారు. ఆర్డీటీ ఆస్పత్రుల ద్వారా ఏటా 8.5 లక్షల మంది సేవలు పొందుతున్నారని తెలిపారు.

విదేశీ నిధులే కీలకం

ఆర్డీటీ మనుగడకు విదేశీ నిధులే కీలకమని, ఎఫ్‌సీఆర్‌ యాక్ట్‌ కింద అనుమతుల పునరుద్ధరణను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో సంస్థ సేవలు ఒక్కొక్కటీ నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే ఆర్డీటీ సెట్‌ను రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు. ఉపాధికి ఊతమిచ్చే శిక్షణ కార్యక్రమాలు, స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంలతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడే సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం లేకపోలేదన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం సైతం పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ఆర్డీటీ పట్ల వ్యవహరించిన ధోరణి సరికాదని పేర్కొన్నారు. ఆర్డీటీకి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement