
తెలంగాణ సీఎస్‌గా గుత్తి వాసి రామకృష్ణారావు
గుత్తి: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గుత్తికి చెందిన రామకృష్ణారావు నియమితులయ్యారు. రామకృష్ణారావు తండ్రి గురునాథ్‌రావు, తల్లి భాగ్యలక్ష్మి. తండ్రి గురునాఽథ్ రావుది గుత్తిలోని కోట. తల్లిది నంద్యాల జిల్లా పాణ్యం. రామకృష్ణారావుకు కుమారుడు , కుమార్తె ఉన్నారు. కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కుమార్తె ఢిల్లీలో న్యాయవాదిగా పని చేస్తున్నారు. రామకృష్ణారావు తాత చంద్రమౌళీశ్వరరావు స్వాతంత్య్ర సమర యోధుడు. రామకృష్ణారావుకు గుత్తిలో ఇల్లుతో పాటు భూమి కూడా ఉంది. ఇంటిని వేరే వారికి విక్రయించినట్లు తెలుస్తోంది. రామకృష్ణారావు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ గుత్తి కోటలోని 8వ వార్డు స్కూల్లో చదువుకున్నారు. అనంతరం కొడిగెనహళ్లిలో 6 నుంచి 10వ తరగతి వరకు, నాగార్జున సాగర్‌లో ఇంటర్, కాన్పూర్ ఐఐటీలో బీటెక్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, డ్యూక్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ (హైదరాబాద్)లో సెటిల్ అయ్యారు. తెలంగాణ ఆర్థికశాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు. రామకృష్ణారావు తెలంగాణ సీఎస్‌గా ఎంపిక కావడంతో గుత్తి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిగ్రీ పరీక్ష తేదీ మార్పు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో మే 7వ తేదీన నిర్వహించాల్సిన డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 4న నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ తెలిపారు. ఏపీ ఐసెట్ పరీక్ష కారణంగా పరీక్షల షెడ్యూల్ మార్పు చేశామని పేర్కొన్నారు.
● బీఈడీ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులు డీబార్ చేసినట్లు రమణ తెలిపారు. తాడిపత్రిలోని జేసీఎన్‌ఆర్ కళాశాలలో బుక్ చేశామని తెలిపారు.