
కూటమి నాయకుల అక్రమాలకు అడ్డ్డూ అదుపు లేకుండా పోతోంది. స
చిట్టూరు వద్ద పెన్నానదిలో జేసీబీతో ఇసుకను ట్రాక్టర్‌లోకి నింపుతున్న దృశ్యం
పెద్దవడుగూరు: పెన్నానది పరివాహక ప్రాంతాల్లో కూటమి నాయకులు ఇసుక దందాను జోరుగా సాగిస్తున్నారు. పెద్దవడుగూరు మండల పరిధిలోని పెన్నానది పరివాహక ప్రాంతాలైన కొండూరు, పి.వీరన్నపల్లి, చిట్టూరు, చిత్రచేడు గ్రామాల సమీపంలో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు. అక్కడే జేసీబీలను ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా నిరంతరం ఇసుకను తరలిస్తూ రూ.లక్షలు వెనుకేసుకుంటున్నారు.
అడ్డదిడ్డంగా తవ్వకాలు
ఇప్పటికే మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక, మట్టి తరలింపు ఇలాగే కొనసాగితే మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొండూరు, చిత్రచేడు గ్రామాల సమీపంలో పండ్ల తోటలు సాగు చేసుకున్న రైతులు బోర్లు వేసుకోగా ఇసుకాసురులు బోర్లు ఉన్న ప్రాంతాలను కూడా వదలక పోవడంతో కేసింగ్ పైపులు పైకి కనిపిస్తున్నాయి. కొండూరు పెన్నానది ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక ప్రాంతంలోనూ తవ్వకాలు చేస్తుండటంతో మృతదేహాలు బయటకు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు.
నోరుమెదపరేం జేసీ..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇసుక అక్రమ తరలింపుపై ఘాటుగానే స్పందించారు. తనవారైనా ఇసుకను తరలిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం మండలంలో అధిక శాతం ఆయన అనుచరులే ఇసుక, మట్టి దందాలు చేస్తున్నా ఆయన ఎందుకు మిన్నకుండిపోతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
పెన్నానది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ట్రాక్టర్లు విపరీతంగా ఇసుకను, మట్టిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఏవైనా అభివృద్ధి పనులకు మాత్రమే అవసరమైన మట్టికి, ఇసుకకు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అయితే అవేవీ లేకుండానే కూటమి నాయకులు గుత్తి, పామిడి పట్టణాల్లోని వెంచర్లలోకి మట్టిని కూడా భారీగా తరలిస్తున్నారు. అధికారులకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
పెన్నాను చెరబట్టిన ఇసుకాసురులు
ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్న కూటమి నేతలు
కళావిహీనంగా పెన్నానది పరివాహక ప్రాంతాలు
నోరుమెదపని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి
అక్రమాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్న అధికారులు

కూటమి నాయకుల అక్రమాలకు అడ్డ్డూ అదుపు లేకుండా పోతోంది. స

కూటమి నాయకుల అక్రమాలకు అడ్డ్డూ అదుపు లేకుండా పోతోంది. స