
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
గుమ్మఘట్ట: మండలంలోని పూలకుంటకు చెందిన వెంకటేశులు, గంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో జె.వెంటకంపల్లి సమీపంలో బీటీపీ ప్రధాన సాగునీటి కాలువలో మంగళవారం ఉదయం దుస్తులు ఉతకేందుకు తల్లి గంగమ్మతో పాటు కుమారుడు అభిరాం (8) వెళ్లాడు. కాలువ నీటిలో సరదాగా ఈత కొడుతున్న అభిరాం కాసేపటి తర్వాత నీటి మునిగాడు. గమనించిన గంగమ్మ గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో ఉన్నవ ఉన్నవారు వెంటనే కాలువలో దిగి బాలుడిని వెలికి తీశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని చికిత్స నిమిత్తం రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి.. బాధిత తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుంతకల్లు రూరల్: మండలంలోని మైనాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ, ప్రభావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి దగ్గర్లో ఉన్న పొలంలోని ఫారంపాండ్‌లోకి వర్షపు నీరు చేరింది. దీంతో మంగళవారం ఈతకెళదామంటూ చిన్న కుమారుడు ప్రణీత్ (8) పట్టుబట్టాడు. దీంతో ప్రణీత్‌ను పిలుచుకుని నానమ్మ ఈరమ్మ ఫారంపాండ్ వద్దకు బయలుదేరింది. అయితే కాస్త దూరంగా ఉండగానే నానమ్మను వదిలి పరుగున వెళ్లిన ప్రణీత్.. ఫారంపాండ్‌లో దూకాడు. ఆ సమయంలో ఈరమ్మ గట్టిగా కేకలు వేయడంతో ఆ పక్కనే ఉన్న గొర్రెల కాపరులు అప్రమత్తమై నీటితో దూకి బాలుడిని వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ప్రణీత్‌ను వెంటనే గుత్తితోని ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. చికిత్స మొదలుపెట్టేలోపు బాలుడు మృతి చెందాడు.
వేర్వేరు ప్రాంతాల్లో నీట మునిగి ఇద్దరు బాలుర మృతి

ప్రాణాలు బలిగొన్న ఈత సరదా